తండ్రికి కొరివి పెట్టిన కూతురు | - | Sakshi
Sakshi News home page

తండ్రికి కొరివి పెట్టిన కూతురు

Sep 5 2026 7:13 AM | Updated on Sep 5 2026 7:13 AM

తండ్రికి కొరివి పెట్టిన కూతురు

మక్కువ/సీతానగరం: కన్న కూతురికి కన్యాదానం చేయాలనేది ప్రతి కన్న తండ్రి కల. అయితే ఆ కన్న తండ్రి కల రోడ్డు ప్రమాదం రూపంలో ఆవిరైపోయింది. తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా చిన్న కూతురు భువనేశ్వరి తండ్రికి కొరివి పెట్టడంతో అక్కడున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళ్తే..మక్కువకు చెందిన లౌడ శ్రీనివాసరావు(55) కురుపాం మండలంలో లైన్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. గురువారం విధులు ముగించుకుని, సీతానగరం మండల కేంద్రంలోని ఎలక్ట్రికల్‌ సబ్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న స్నేహితుడి వద్ద రాత్రి పడుకున్నాడు. శనివారం తెల్లవారుజామున 4గంటల సమయంలో లేచి, మక్కువ వెళ్తానని చెప్పి బయల్దేరి వెళ్లగా గుర్తు తెలియని వాహనం చినభోగిలి గ్రామం సమీపంలో ఢీకొని తలమీద నుంచి వెళ్లిపోవడంతో అక్కడక్కడే శ్రీనివాసరావు మతిచెందాడు. సమాచారం మేరకు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని, ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. పంచనామా నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. శ్రీనివాసరావుకు భార్య ఉమావెంకటలక్ష్మి, పెద్ద కూతురు నాగశ్వేత, చిన్న కూతురు భువనేశ్వరి ఉన్నారు. ఈ ఆదివారం పెద్దకుమార్తె పెళ్లి నిశ్చితార్థానికి, పెళ్లి ముహూర్తాల కోసం మగపెళ్లివారు వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇంతలో విధి కన్నెర్ర చేయడంతో కన్న కూతురి పెళ్లి చూడకుండానే ఆ తండ్రి కడలోకానికి చేరుకున్నాడు. పెద్ద కుమార్తె బీటెక్‌ పూర్తి చేయగా చిన్నకుమార్తె భువనేశ్వరి ఎంఎస్సీ పూర్తిచేసి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది. భార్య ఉమావెంకటలక్ష్మి గృహిణి.

శోకసంద్రంలో మక్కువ

శ్రీనివాసరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ మావుడి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు మావుడి రంగునాయుడు, డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ మావుడి తిరుపతినాయుడు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వందలాదిమంది మండల ప్రజలు ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం అనంతరం శ్రీనివాసరావు అంతిమయాత్రలో వేలాదిమంది కుటుంబసభ్యులు, స్నేహితులు, ఉద్యోగులు, స్థానికులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.

కన్నకూతురి పెళ్లి చూడకుండానే తండ్రి కడలోకానికి

గుర్తు తెలియని వాహనం ఢీకొని లైన్‌ఇన్‌స్పెక్టర్‌ మృతి

కన్నీరుమున్నీరైన కుటుంబసభ్యులు, గ్రామస్తులు, బంధువులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement