● నాడు చకచకా.. నేడు తికమకగా...
● సర్వేపై రైతుల్లో ఆందోళన
● జాయింట్ ఎల్‌పీఎంలతో తప్పని తిప్పలు
విజయనగరం గంటస్తంభం:
జిల్లాలో భూముల సమగ్ర సర్వే రెండేళ్లుగా నత్తనడకగా సాగుతోంది. రైతన్నలను ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలోనే వందేళ్ల తర్వాత గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా చేపట్టిన శాశ్వత భూహక్కు–భూరక్ష సమగ్ర రీ–సర్వే ప్రక్రియ విజయనగరం జిల్లాలో ఒక విప్లవంగా సాగింది. డ్రోన్లు, రోవర్లు వంటి అత్యాధునిక సాంకేతికతతో జిల్లా పరిధిలోని వందలాది గ్రామాల్లో సకాలంలో పనులు పూర్తి చేసి, వేలాది మంది రైతులకు క్యూఆర్ కోడ్‌తో కూడిన ఆధునిక భూహక్కు పత్రాలను అందించారు. ఉచితంగా మ్యుటేషన్లు, ల్యాండ్ పార్సెల్ మ్యాప్‌లతో పాటు రైతుకు రూపాయి ఖర్చు లేకుండా సరిహద్దు వివాదాలకు ముగింపు పలికారు. అయితే, నేడు చంద్రబాబు ప్రభుత్వం ఏలుబడిలో ఆ పరిస్థితి తలకిందులైంది. నాడు అత్యంత వేగంగా సాగిన రీ–సర్వే ప్రక్రియ నేడు నత్తనడకగా సాగుతోంది. ఇప్పటికే పూర్తికావాల్సిన ప్రక్రియ ఇంకా కొనసాగుతుండడం, భూహద్దు సమస్యలు పరిష్కరిస్తూ హద్దురాళ్లు వేయకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
● గడువులన్నీ గాలికి...
విజయనగరం జిల్లాలో మొత్తం 27 మండలాల పరిధిలోని 983 రెవెన్యూ గ్రామాల్లో రీ–సర్వే పూర్తి చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 2 మండలాల్లో మాత్రమే ప్రక్రియ తుదిదశకు చేరింది. 639 గ్రామాల్లో పనులు సాగుతున్నాయని చెబుతున్నా రికార్డులు సరిగ్గా వెబ్‌ల్యాండ్‌లో నమోదుకాలేదు. 344 గ్రామాల్లో రైతుల భూ రికార్డులు ఇంకా గాలిలోనే ఉన్నాయి. సర్వే పురోగతి 65 శాతంగా ఉంది. సర్వే బృందాలను కుదించడమే కాకుండా, ప్రతి దశకు నిర్ణయించిన గడువులను కూటమి సర్కారు నీరుగార్చింది. డ్రాఫ్ట్ పాస్‌బుక్‌ల జారీ, తహసీల్దార్ పరిశీలన, జేసీ ఆమోదం వంటి కీలక దశల్లో ఫైళ్లు నెలల తరబడి మగ్గిపోతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
● జాయింట్ ఎల్‌పీఎంలతో తిప్పలు..
రీ–సర్వేలో ప్రధాన సమస్యగా జాయింట్ ఎల్‌పీఎంల వ్యవహారం మారింది. జిల్లాలో 1,35,465 జాయింట్ ఎల్‌పీఎంలు ఉండగా 1,07,835 పూర్తయ్యాయి. ఇంకా 27,630 పరిష్కరించాల్సింది. ఒకే భూమిపై పలువురి పేర్లు ఉండడం, వారసత్వం, విభజన తదితర కారణాలతో వీటి పరిష్కారానికి సమయం పడుతోంది. ఫలితంగా రైతులు తమ వాటా, హక్కులు స్పష్టంగా రికార్డుల్లో నమోదయ్యే వరకు ఎదురుచూడాల్సి వస్తోంది.
● పేరు మారింది.. సమస్య తీరిందా?
భూ రికార్డులను ఆధునీకరించి రైతులకు స్పష్టమైన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రీ–సర్వేను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. డ్రోన్లు, ఆధునిక సర్వే పరికరాలు, డిజిటల్ రికార్డుల అనుసంధానంతో ప్రక్రియను ముందుకు తీసుకెళ్లింది. ప్రభుత్వం మారిన తర్వాత కొంతకాలం నిలిచిపోయిన ప్రక్రియ.. ఇప్పుడు రీ–సర్వే 2.0 పేరుతో కొనసాగుతోంది. అయితే, పేరు మార్చినంత వేగంగా పనులు జరగడం లేదని రైతులు విమర్శిస్తున్నారు.


