నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలి ‘సర్‌’ | - | Sakshi
Sakshi News home page

నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలి ‘సర్‌’

Aug 14 2026 7:20 AM | Updated on Aug 14 2026 7:20 AM

విజయనగరం గంటస్తంభం: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌–2026) ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా పూర్తిచేయాలని జిల్లా ఎన్నికల అధికారులు, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, బీఎల్‌ఓలకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్‌ సూచించారు. జిల్లా ఎన్నికల అధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1847 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి బీఎల్‌ఓ, బీఎల్‌ఏ సమావేశాల మినిట్స్‌ను బీఎల్‌ఓ యాప్‌లో శతశాతం అప్‌లోడ్‌ చేశామని, ముసాయిదా ఓటర్ల జాబితాలు, ఏఎస్‌డీడీ జాబితాలు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా 1,93,733 నోటీసులు జనరేట్‌ చేయగా, వాటిలో 66,428 నోటీసులు పంపిణీ అయ్యాయని, మిగిలిన నోటీసులు ఈ నెల 20వ తేదీలోగా అందజేస్తామన్నారు. సెప్టెంబర్‌ 14వ తేదీలోగా విచారణ పూర్తిచేస్తామని చెప్పారు. జిల్లాలో ఫారం–6లు 5,056, ఫారం–7లు 134, ఫారం–8లు 3,603 అందాయని, వీటిని నిబంధనల ప్రకారం పరిశీలించి నిర్దేశిత గడవులోగా పరిష్కరిస్తామన్నారు. సర్‌పై అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచారదినాలు నిర్వహిస్తామని, ఆయా రోజుల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కేంద్రాల్లో బీఎల్‌ఓలు, రాజకీయ పార్టీల ఏజెంట్లు అందుబాటులో ఉంటారని తెలిపారు.

చికిత్స పొందుతూ వివాహిత మృతి

దత్తిరాజేరు: మండలంలోని వంగర పంచాయతీ మధుర గ్రామమైన ముద్దనపేట గ్రామానికి చెందిన పిట్ట అశ్విని (33) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. పెదమానాపురం ఎస్సై కళాధర్‌ తెలియజేసిన వివరాల మేరకు.. అశ్విని పదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఎంతమంది వైద్యులను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల పదో తేదీన ఇంటిలో ఉన్న పురుగు మందు తాగింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. మృతిరాలి భర్త ఒడిశా రాష్ట్రంలో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నారు. ఆమె మామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి..

పూసపాటిరేగ: మండలంలోని నక్కానపేట సాయిస్తూపం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పూసపాటిరేగ గ్రామానికి చెందిన తిరుమలరాజు సాయివర్మ (29) తన స్నేహితుడితో కలిసి గురువారం సాయంత్రం చింతపల్లి నుంచి పూసపాటిరేగకు బుల్లెట్‌పై వస్తుండగా.. సరిగ్గా సాయి స్తూపం వద్దకు వచ్చేసరికి లారీ ఢీ కొనడంతో సాయివర్మ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న అతని స్నేహితుడికి స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం కేంద్రాస్పత్రికికి తరలించారు. పూసపాటిరేగ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement