విజయనగరం గంటస్తంభం: సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థి సంఘాలను నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి డి.రాము డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం విజయనగరం కాంప్లెక్స్ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. విద్యార్థులను కలవకుండా వారి సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ బిల్లులు పెంచాలని కోరారు. సర్క్యులర్‌ను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఐదు బ్యాటరీలు రికవరీ
వేపాడ: మండలంలోని పలు గ్రామాల్లో ట్రాక్టర్ల బ్యాటరీలు చోరీకి గురైన ఘటనలో నిందితులను పట్టుకుని ఐదు బ్యాటరీలను రికవరీ చేసినట్లు ఎస్సై సుదర్శన్ ఆదివారం తెలిపారు. బొద్దాం, పాటూరు, జాకేరు గ్రామాల్లో ఐదు ట్రాక్టర్లకు సంబంధించిన బ్యాటరీ లు చోరీకి గురైనట్లు గురువారం పాటూరుకు చెందిన పి.వేణుగోపాల్ ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై చెప్పారు. ఆదివారం పాటూరు జంక్షన్ వద్ద బొద్దాం గ్రామానికి చెందిన సయ్యద్ అబ్దుల్లా, గుడిసె తిరుపతిరావు జనపరెడ్డి మోహన్‌లను అదుపులోకి తీసుకుని వారి నుంచి ఐదు ట్రాక్టర్ బ్యాటరీలను రికవరీ చేసి తదుపరిచర్యలు తీసుకున్నట్లు ఎస్సై సుదర్శన్ చెప్పారు.
42 కేజీల గంజాయి స్వాధీనం
పాచిపెంట: మండలంలోని కుడుమూరు సమీపంలో పెద్దగెడ్డ జలాశయం బట్టి కుడికాలువ వద్ద తమిళనాడు రిజిస్ట్రేషన్‌తో ఉన్న కారులో తరలిస్తున్న 42 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పాచిపెంట ఎస్సై ఎల్.అర్జున్ ఆదివారం వివరాలు వెల్లడించారు. పెద్దగెడ్డ జలాశయం బట్టి కుడికాలువ వద్ద అనుమానాస్పదంగా నిలిపి ఉన్న కారును సమాచారం మేరకు తనిఖీ చేసి కారులో 22 ప్యాకెట్లలో గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకునామని ఎస్సై పేర్కొన్నారు. గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి కేసు నమోదు చేసి సాలూరు రూరల్ సీఐ రామకృష్ణ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులను త్వరలోనే గుర్తించి అదుపులోకి తీసుకుంటామని, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. అక్రమ రవాణాకు సంబంధించి సమాచారం తెలిసిన వారు వెంటనే సమీప పోలీస్‌స్టేషనన్‌కు తెలియజేయాలని కోరారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
గంట్యాడ: మండలంలోని కొర్లాం గ్రామంలో ఆదివారం గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. చెరుకు కాటా నుంచి గింజేరు వెళ్లే ప్రధాన రహదారి పక్కన మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి మృతుడు పసుపు రంగు దుస్తులు ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతదేహం నుంచి కుళ్లిన వాసన వస్తుండడంతో రెండు, మూడు రోజుల క్రితమే మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికృష్ణ తెలిపారు.


