పార్వతీపురం రూరల్: చట్టాలపై అవగాహన పెంచుకుందాం.. బాధ్యతగల పౌరులుగా మెలుగుదాం అనే నినాదంతో మన్యం జిల్లా పోలీసులు చేపట్టిన ‘మీ పోలీస్–మీకు తెలుసా’ కార్యక్రమం విజయవంతమైంది. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి ఆదేశాలతో పార్వతీపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన అవగాహన పరీక్షకు విశేష స్పందన లభించింది. అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన ఈ పరీక్షలో 21 ఏళ్లలోపు వయసున్న సుమారు 800 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.సైబర్ నేరాల ఉచ్చు..గంజాయి, మాదకద్రవ్యాల మత్తు..ట్రాఫిక్ నిబంధనలు తదితర సమకాలీన అంశాలతో పాటు మహిళలపై నేరాల నివారణ, మానవ అక్రమ రవాణా నిరోధం వంటి కీలక చట్టాలపై 30 బహుళైచ్ఛిక (ఆబ్జెక్టివ్) ప్రశ్నలతో ఈ పరీక్షను రూపొందించారు. విద్యార్థులు ఆసక్తిగా సమాధానాలు గుర్తించి డ్రాప్ బాక్స్‌లో వేశారు. పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి మూడు స్థానాల విజేతలకు ఎస్పీ చేతులమీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నారు. అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఆనన్‌లైన్ సర్టిఫికెట్లు అందజేశారు. పట్టణ సీఐ బి.వెంకట్రావు, ఎస్సై గోవింద్, పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.
పాల్గొన్న 800 మంది విద్యార్థులు


