విజయనగరం టౌన్: సంస్కృత భాషను భావితరాలకు అందించే బాధ్యత మనందరిపైనా ఉందని వాగ్దేవి సమారాధనం స్వచ్ఛంద సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్ష్యురాలు, రాజాం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక గురజాడ స్వగృహంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో సంస్కృత భాషా దినోత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాగ్దేవి, తెలుగు భాషా పరిరక్షణ సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28న నిర్వహించనున్న సంస్కృతభాషా దినోత్సవానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు పలు రకాల పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రశంసాపత్రాలు అందిస్తామని చెప్పారు. అందుకు తగ్గట్టుగా సంస్థ ప్రతినిధులందరికీ బాధ్యతలు అప్పగించామన్నారు. వ్యాసరచన, వక్తృత్వం, శ్రీరామాయణ పాత్రలు, సంస్కృతభాషా వైశిష్ట్యం, శ్రీమద్భగవద్గీత పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 7032494988 నంబర్‌ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో సముద్రాల గురుప్రసాద్, రాంభట్ల సన్యాసిరాజు, అల్లం సూర్యరాజేశ్వరశర్మ, భోగరాజు సూర్యలక్ష్మి, మానాప్రగడ సాహితి, దాసరి పద్మ, కర్రి సంతోషలక్ష్మి, కె.సావిత్రి, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


