చెరకు రైతుకు చేదువార్త..! | - | Sakshi
Sakshi News home page

చెరకు రైతుకు చేదువార్త..!

Aug 9 2026 2:28 AM | Updated on Aug 9 2026 2:28 AM

వాస్తవం:

రెండేళ్లలో జిల్లాకు ఒక్క కొత్త పరిశ్రమ రాలేదు. తేలేదు. ఇప్పుడు భీమసింగి చక్కెర కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

‘విజయనగరం జిల్లా జామి మండలంలోని భీమసింగి చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తాం. చెరకు సాగును ప్రోత్సహిస్తాం. రైతులకు పూర్వ వైభవం తీసుకొస్తాం. 2024 సార్వత్రిక ఎన్నికల సభల్లో ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు, ఎంఎస్‌ఎం, సెర్ప్‌, ఎన్‌ఆర్‌ఐ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఇచ్చిన హామీ.

భీమసింగి సుగర్‌ ఫ్యాక్టరీ

విజయనగరం ఫోర్ట్‌:

చెరకు రైతులకు చేదువార్త ఇది. 1961 ఫిబ్రవరి 9న విజయనగరం జిల్లా జామి మండలంలోని భీమసింగి గ్రామంలో స్థాపించిన చక్కెర కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేస్తూ చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. వేలాదిమంది చెరకు రైతులకు అండగా, వందలాది మందికి ఉపాధి కల్పించిన కర్మాగారాన్ని కాలగర్భంలో కలిపేసేందుకు పూనుకుంది. ఇది ఉమ్మడి విజయనగరం జిల్లా రైతులను, కార్మికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్నికల సమయంలో భీమసింగి సుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామంటూ హామీ ఇచ్చిన టీడీపీ నేతలు... ఇప్పుడు అదే ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేసేందుకు ఉత్తర్వులు జారీచేయడంపై రైతాంగం భగ్గుమంటోంది. ఓ వైపు తెల్ల అన్నంను ఎవరూ తినడంలేదని, వరి పంటను సాగుచేయొద్దని, ధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేయలేదని ప్రకటనలు చేస్తున్న వ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు... వరికి ప్రత్యామ్నాయంగా చెరకు సాగును ప్రోత్సహించాల్సిన సమయంలో సుగర్‌ ఫ్యాక్టరీ మూసివేతకు చర్యలు తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూతపడిన సుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించి రైతులను ఆదుకోవాల్సిన సర్కారు శాశ్వతంగా ఫ్యాక్టరీని లేకుండా చేసేందుకు పూనుకోవడంపై రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వ చర్యలతో చెరకు పంట పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

షేర్‌ హోల్డర్స్‌గా రైతులు

భీమసింగి సుగర్‌ ఫ్యాక్టరీలో వేలాది మంది రైతులు షేర్‌ హోల్డర్స్‌గా ఉన్నారు. ఒక వేల సుగర్‌ ఫ్యాక్టరీ గురించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మహాజన సభ ఏర్పాటుచేసి రైతులందరి ఆమోదంతోనే నిర్ణయం తీసుకోవాలి. అయితే, చంద్రబాబు సర్కారు రైతుల ఆమోదం లేకుండా నిర్ణయం తీసుకోవడంపై రైతుల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది.

పెద్దఎత్తున ఉద్యమిస్తాం

భీమసింగి సుగర్‌ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రైతులతో కలిసి పెద్దఎత్తున ఉద్యమం చేపడతాం. సుగర్‌ ఫ్యాక్టరీ రైతుల ఆస్తి. ప్రభుత్వ ఆస్థి కాదు. రైతుల ఆమోదం లేకుండా మూసివేత ఉత్తర్వులు ఎలా ఇస్తారు. సుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించి చెరకు రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం మూసివేతకు ఉపక్రమించడం దారుణం.

– బుద్దరాజు రాంబాబు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి

మూసివేయడం సరికాదు

భీమసింగి సుగర్‌ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేయడం సరికాదు. ఈ ఫ్యాక్టరీకి ఎంతో చరిత్ర ఉంది. మా ప్రాంతంలో వరి కంటే ఎక్కువగా చెరకు సాగుచేసేవారం. చెరకు పంటను ఫ్యాక్టరీకి విక్రయించేవారం. ఫ్యాక్టరీ మూత పడడంతో చెరకు పంట సాగు చేయడం మానివేశాం. వరి సాగుచేయొద్దని వ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. అలాంటి సమయంలో సుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించి చెరకు సాగును ప్రోత్సహించాలి. అలాకాకుండా ఫ్యాక్టరీ మూసివేతకు చర్యలు తీసుకోడం విచారకరం.

– కె.రాజు, రైతు, కోరుకొండపాలెం,

విజయనగరం మండలం

2004లో ఫ్యాక్టరీని తెరిపించిన వైఎస్సార్‌

2004కు ముందు సుగర్‌ ఫ్యాక్టరీ మూతపడింది. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం మూతపడిన సుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించే ప్రయత్నం చేయలేదు. 2004లో పాదయాత్ర సమయంలో రైతులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని కలిసి ఫ్యాక్టరీని తెరిపించాలని విన్నవించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్‌ సుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించారు. రాయితీలు కల్పించారు. ఆయన హయాంలో సుగర్‌ ఫ్యాక్టరీ బాగానే నిర్వహించారు. ఆయన మరణానంతరం ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందక మళ్లీ సుగర్‌ ఫ్యాక్టరీ మూత పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించలేదు. ఎప్పటికై నా సుగర్‌ ఫ్యాక్టరీని ప్రభుత్వం తెరిపిస్తుందని ఆశతో రైతులు ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లేలా శాశ్వతంగా ఫ్యాక్టరీని మూసివేస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేయడం రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

నాటి అండ నేడు ఏదీ?

జిల్లా వ్యాప్తంగా గతంలో సుమారు 50వేల హెక్టార్లలో చెరకు పంట సాగయ్యేది. పండించిన చెరకును భీమసింగి సుగర్‌ ఫ్యాక్టరీకి రైతులు తరలించేవారు. ముందుగా జిల్లాలోని ఎస్‌. కోట, కొర్లాం, బొబ్బిలి, గజపతినగరం తదితర ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన చెరకు కాటాల వద్ద తూకం వేశాక లారీలపై భీమసింగి చక్కెర కర్మాగారానికి పంటను తీసుకెళ్లేవారు. భీమసింగి ఫ్యాక్టరీ మూతపడ్డాక చెరకు సాగు విస్తీర్ణం క్రమేణా తగ్గింది. ప్రస్తుతం జిల్లాలో 2,200 హెక్టార్లకే చెరకు సాగు పరిమితమైంది. పండించిన చెరకును బెల్లం క్రషర్ల్‌కు రైతులు విక్రయిస్తున్నారు. మద్దతు ధర రాకపోయినా గత్యంతరం లేక రైతులు విక్రయిస్తున్నారు.

సుగర్‌ ప్యాక్టరీ టీడీపీ సర్కారు హయాంలోనే మూతపడింది. దీంతో వందలాదిమంది రెగ్యులర్‌, కాంట్రాక్టు కార్మికులు ఉపాధి కోల్పోయారు.

భీమసింగి సుగర్‌ ఫ్యాక్టరీని

శాశ్వతంగా మూసివేతకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

నెరవేరని మంత్రి హామీ

ఆవేదనలో రైతాంగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement