ఈ ఫొటోలోని గుడ్డు చూసి ఇదేదో కోడి పొల్లు గుడ్డు అనుకుంటే పొరబడినట్టే. రాజాం పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీచేస్తున్న కోడిగుడ్లు సైజు ఇలా చిన్నగా మారిపోయింది. సాధారణంగా గుడ్డు 50 గ్రాముల నుంచి 65 గ్రాముల బరువు ఉంటుంది. అంతకంటే తక్కువ ఉంటే నాణ్యతలేనట్టుగా భావిస్తారు. పాఠశాలలకు వచ్చే గుడ్లు 50 గ్రాములు కంటే తక్కువగా ఉంటున్నాయి. నాణ్యతతో పాటు సాధారణ పరిమాణం లేని గుడ్లను ఏజెన్సీలు సరఫరా చేస్తున్నా వంట నిర్వాహకులు ఎదిరించలేక విద్యార్థులకు
వండిపెడుతున్నారు. కొన్నిసార్లు గుడ్లు పాడవ్వడంతో విద్యార్థులకు వడ్డించలేని పరిస్థితి తలెత్తుతోందని వాపోతున్నారు. – రాజాం


