విజయనగరం మండలం
జొన్నవలసలో నారుమడిని ట్యాంకర్ల నీటితో తడుపుతున్న రైతులు
విజయనగరం ఫోర్ట్:
జిల్లాలో ప్రధాన ఆహార పంట వరి సాగు ప్రశ్నార్ధకంగా మారింది. ఖరీఫ్ సీజన్‌లో సాగయ్యే పంటల్లో అధిక శాతం సాగయ్యేది వరి పంటే. ఎలినినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో వరితో పాటు మిగతా పంటలు కూడా సాగయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఎలినినో ప్రభావం క్రమేణ తీవ్రమవుతుండడంతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. వరి పంట వేయొద్దని చంద్రబాబు ప్రభుత్వం చెబుతుండడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఆహార పంట పండించకపోతే ఎలాగని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్టు రైతులు ఆ దిశగా అడుగులు వేస్తే ఆహార సంక్షోభం తప్పదని వారు పేర్కొంటున్నారు. ఎలినినో ప్రభావం అన్ని పంటల సాగుపై కనిపిస్తుంది. జిల్లాలో అధిక శాతం పంటల సాగు వర్షాధారంపైనే ఆధారపడి ఉంది. వర్షాభావం వల్ల చెరువులు, గుంతలు ఎండిపోయాయి. ఉన్న కొద్దిపాటి నీటిని ఆయిల్ ఇంజిన్లు, ట్యాంకర్ల ద్వారా తోడయ్యేడంతో అవి కూడా ఎండిపోయాయి. మరోవైపు భూగర్భ జలాలపై కూడా ఎలినినో ప్రభావం పడుతోంది. గతంలో కరువు పరిస్థితులు వచ్చినా ఇంత దారుణ పరిస్థితులు లేవని రైతులు చెబుతున్నారు. కనీసం 40 నుంచి 50 శాతం వరకు పంటలు చేతికొచ్చేవని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని, కనీసం పది శాతం పంటలు కూడా వచ్చేలా లేవని, ముఖ్యంగా వరి పంట పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో వరికి ప్రత్యామ్నాయంగా 26,253 హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటల కోసం వ్యవసాయ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకోసం 6,415 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. మినుము పంట 13,570 హెక్టార్లకుగాను 2,996 క్వింటాళ్ల విత్తనాలు, పెసర పంట 9,576 హెక్టార్లకుగాను 2023 కింటాళ్ల విత్తనాలు, చోటి 1161 హెక్టార్లకుగాను 83 క్వింటాళ్ల విత్తనాలు, మొక్కజొన్న 1805 హెక్టార్లకుగాను 775 క్వింటాళ్లు విత్తనాలు, వేరుశనగ 205 హెక్టార్లకుగాను 455 క్వింటాళ్లు, ఉలవ పంట 206 హెక్టార్లకుగాను 83 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
ప్రభుత్వం వరి సాగు చేయవద్దని చెప్పడంతో దళారులు, మిలర్లు గతంలో వారు కొనుగోలు చేసిన ధాన్యాన్ని బ్లాక్ చేస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించడం వల్ల నిత్యావసర ధరలు బాగా పెరిగిపోయాయి. బియ్యం, వంట నూనెలు, పంచదార ఇలా అన్ని ధరలు పెరిగిపోయాయి. సాంబమసూరి 25 కేజీల బస్తా కు రూ.200 నుంచి 250 వరకు పెరిగింది. రిఫైండ్ ఆయిల్ ధర రూ.190కు చేరింది. పంచదార రూ.50 దాటింది. కందిపప్పు రూ.135 నుంచి రూ.140కు చేరింది.
ప్రత్యామ్నాయ ప్రణాళిక
ఎలినినో ప్రభావం నేపథ్యంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరికి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సిద్ధం చేశాం. 26,523 హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.
– వి.టి.రామారావు, జిల్లా వ్యవసాయ అధికారి
ధాన్యాన్ని బ్లాక్ చేస్తున్న మిల్లర్లు, దళారీలు
జిల్లాలో వరి పంట సాగు గణనీయంగా తగ్గిపోయింది. వరి పంట సాధారణ విస్తీర్ణం 1,00,251 హెకార్లు కాగా కేవలం 10,645 హెక్టార్లకే సాగు పరిమితమైంది. ఇందులో కూడా 9787 హెక్టార్లలో వెద పద్ధతిలో సాగు చేసిందే కావడం గమనార్హం. 858 హెక్టార్లు మాత్రమే నాట్లు వేసింది. మిగిలిన పంటల పరిస్థితి కూడా అలానే ఉంది. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో అన్ని పంటల సాధారణ విస్తీర్ణం 1,23,608 హెక్టార్లు. ఇప్పటి వరకు సాగైంది కేవలం 24,294 హెక్టార్లు మాత్రమే.
జిల్లాలో 10,645 హెక్టార్లకే
వరి సాగు పరిమితం
వరి సాధారణ విస్తీర్ణం
1,00,251 హెక్టార్లు
ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం
చేసిన వ్యవసాయ శాఖ


