విజయనగరం గంటస్తంభం:
ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని పెంచేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో వివిధ ఆదాయ సముపార్జన శాఖల అధికారులతో ఆయన బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ లక్ష్యాలను సాధించడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని, నిర్దేశిత లక్ష్యాలను కచ్చితంగా అధిగమించాలని స్పష్టం చేశారు. శాఖల వారీగా వసూళ్ల పురోగతిని సమీక్షించి, ఆదాయాన్ని పెంచాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా రిజిస్ట్రార్ ఎస్.మోహన్‌రావు, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మణికుమార్, భూగర్భ గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ సూర్యచంద్రరావు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు, జీఎస్టీవో శివరావు తదితరులు పాల్గొని తమ శాఖల ద్వారా సమకూరుతున్న ఆదాయ వివరాలను కలెక్టర్‌కు వివరించారు.
జిల్లాలో జలశక్తి అభియాన్ పథకం అమలు, వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ చాంబర్‌లో జిల్లా అధికారులతో బుధవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగ పరిస్థితులు, వర్షాధార భూములకు సాగునీరు అందించేందుకు కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న జలశక్తి – జలహారతి పనులపై సమీక్షించారు. భూగర్భ జల మట్టాలను మరింతగా పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నీటి వనరుల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. ఉద్యాన పంటల సాగు విస్తరణకు తగిన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సీపీఓ పి.బాలాజీ, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు వి.తారకరామారావు, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్.శారదాదేవి, ఇరిగేషన్ ఈఈ గోవిందరావు, భూగర్భ జల శాఖ డిప్యూటీ డైరెక్టర్ దినకర్ తదితర అధికారులు పాల్గొన్నారు.


