మోడల్ స్కూల్‌లో
● మధ్యాహ్న భోజనంలో దారుణం
● నిర్వాహకుల ఆగ్రహం
● కాంట్రాక్టర్లపై చర్యలకు డిమాండ్
విజయనగరం: పాఠశాలల్లో పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం మళ్లీ బయటపడింది. విజయనగరంలోని పూల్‌బాగ్ ఏపీ మోడల్ పాఠశాలలో సరఫరా చేసిన కోడిగుడ్లు కుళ్లిపోయి ఉండటం బుధవారం తీవ్ర కలకలానికి దారితీసింది. పాఠశాలలో విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధం చేసిన గుడ్ల స్టాక్‌ను పరిశీలించగా, అందులో ఎక్కువ గుడ్లు కుళ్లిపోయి తీవ్ర దుర్వాసన వస్తున్నట్లు భోజన నిర్వాహకులు గుర్తించారు. ఉడకబెట్టిన తర్వాత గుడ్లు రంగు మారి, నాణ్యత లేకుండా ఉండటంతో నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యంతో ఆడుకుంటున్న బాధ్యతారహిత కాంట్రాక్టర్లపై, పర్యవేక్షణ లోపించిన సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.


