విజయనగరం అర్బన్: జిల్లా ప్రగతి కేవలం కాగితాలకే పరిమితమవుతోందా? క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు గాలికొదిలేసి.. సమీక్షల్లో మాత్రం అధి కారులు అంకెల గారడీతో కాలక్షేపం చేస్తున్నారా? అంటే ... గురువారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశం (డీఆర్‌సీ) సాక్షిగా అవుననే సమాధానమే వినిపిస్తోంది. జిల్లాను రాష్ట్రానికే వెన్నెముకగా మారుస్తామంటూ మంత్రులు వంగలపూడి అనిత, కె.శ్రీనివాస్ భారీ డైలాగులు చెప్పినప్పటకీ, అంతర్గత సమీక్షలో మాత్రం జిల్లాలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులు, అధికారుల అలసత్వం, ప్రభుత్వ వైఫల్యాలు ఒక్కొక్కటిగా బట్టబయలయ్యాయి.
నివేదికలకే పరిమితమా...
అధికారులు సమర్పించిన ప్రగతి నివేదికలపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనిత అసహనం వ్యక్తం చేశారు. సమీక్షల్లో కేవలం ‘అంకెల ప్రదర్శన’ చూపిస్తే సరిపోదని, వాటిని క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో అమలు చేసి చేతల్లో చూపించాలంటూ అధికారులపై గుర్రు మన్నారు. వివిధ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లనే ప్రజాసమస్యలు ఎక్కడికక్కడే పేరుకుపోతున్నాయని మండిపడ్డారు. తీవ్ర ఆందోళన కలిగిస్తున్న ఎల్‌నినో పరిస్థితులను ధీటుగా ఎదుర్కొనేందుకు ఇప్పటి వరకు అధికార యంత్రాంగం వద్ద కనీసం ముందస్తు ప్రణాళికలు కూడా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానాలు లేకోవడంతో నెలరోజుల్లోగా చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలంటూ డెడ్‌లైన విధించారు. కొన్ని ప్రభుత్వ వైఫల్యాలను అధికారులపైకి నెట్టేప్రయత్నం చేయడంపై కొందరు అధికారులు గుసగుసలాడారు.
కూరగాయలకూ పరాయి రాష్ట్రాల వైపే చూపు
వ్యవసాయాధారిత జిల్లాగా పేరున్న విజయనగరంలో సాగు రంగం ఎంతలా నిర్లక్ష్యానికి గురవుతోందో స్వపక్ష ప్రజాప్రతినిధులు వ్యాఖ్యలతో స్పష్టమైంది. జిల్లాకు అవసరమైన కూరగాయల్లో ఏకంగా 60 శాతాన్ని ఇప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచే దిగుమతి చేసుకోవడం దారుణమని ఆక్షేపించారు. ఉద్యాన పంటల సాగు కోసం 10 వేల ఎకరాల్లో ‘మిషన్ హార్టివిజన్’ అంటూ ఘనంగా ప్రకటనలు గుప్పిస్తున్నా... క్షేత్రస్థాయిలో మాత్రం కూరగాయల కొరత వేధిస్తూనే ఉందంటూ పాలకులే పేర్కొనడం పాలనా వైఫల్యాన్ని ఎత్తిచూపింది.
డీఆర్‌సీ సమీక్షలో బట్టబయలైన పాలనా వైఫల్యాలు
‘అంకెలు కాదు... చేతల్లో చూపండి’
అంటూ అధికారులపై ఇన్‌చార్జి మంత్రి గుర్రు
ప్రభుత్వ వైఫల్యాలను కూడా
అధికారులపైకి నెట్టేసిన వైనం
దిగుమతి కూరగాయలే దిక్కు... నిర్లక్ష్యంలో హార్టికల్చర్ రంగం
నీటి వనరులన్నీ ఆక్రమణలపాలు...
పట్టించుకోని అధికార యంత్రాంగం
ఆక్రమణల చెరలో చెరువులు
జిల్లాలో పారిశుద్ధ్యం నిర్వహణ పడకేసింది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు కలుషితమై డయేరియా (అతిసార), సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉందని, ఒకవేళ రోగాలు విజృంభిస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అనిత హెచ్చరించారు. మరోవైపు, జిల్లాలోని పంటకాలువలు, చెరువులు, సాగునీటి వనరులు విచ్చలవిడిగా ఆక్రమణలకు గురవుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తేల్చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారగా... కేవలం ప్రణాళికల తయారీతోనే కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇన్‌చార్జి మంత్రి అనిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, భరత్, ఎమ్మెల్సీలు డాక్టర్ పి.సురేష్‌బాబు, డాక్టర్ గాదె శ్రీనివాసులునాయుడు, ఇందుకూరి రఘురాజు, మార్కెఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, ఎమ్మెల్యేలు కిమిడి కళావెంకటరావు, లోకం నాగమాధవి, బేబీనాయన, పి.అదితి విజయలక్ష్మి, కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి, జేసీ సేతుమాధవన్, సీపీఓ పి.బాలాజీ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


