విజయనగరం: ‘మేమున్నాం’ పేరుతో జిల్లా ట్యాక్సీ ఓనర్స్ అసోసియేషన్ ఆప్తులకు అండగా మెగా రక్తదాన శిబిరాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం అభినంద నీయమని ఎస్పీ దామోదర్, ఏపీ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు. ఈ మేరకు గురువారం రెవెన్యూ కల్యాణమంటపంలో జరిగిన రక్తదాన శిబిరాన్ని జ్యోతి వెలిగించి వారు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సమాజంలో ప్రతి పౌరుడికీ ఒక సామాజిక బాధ్యత ఉంటుందని అటువంటి బాధ్యతను గుర్తించి పని చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ట్యాక్సీ ఓనర్లు తమ సంపాదనలో కొంత భాగం చలివేంద్రాలు, ప్రమాదాలు జరిగినప్పుడు సహాయం చేస్తూ సమాజం కోసం ఖర్చు చేయడమే కాకుండా రోగుల అవసరాల కోసం రక్తదానం చేయడం గొప్ప విషయమని ప్రశంసించారు. రానున్న రోజుల్లో మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజ ఉన్నతికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రామకృష్ణ, శరత్, అజయ్, శ్రీనివాస్, అప్పారావు, పెద్ద సంఖ్యలో డ్రైవర్లు, ట్యాక్సీ ఓనర్‌లు పాల్గొన్నారు.


