● కలెక్టర్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
షంషేర్ సింగ్ రావత్ ఆదేశాలు
విజయనగరం అర్బన్: ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్–2025 (పీఓ–2025) ప్రకారం స్థానిక కేడర్ల పునర్‌వ్యవస్థీకరణ, ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ మేరకు సకాలంలో పూర్తి చేయాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ కలెక్టర్లను గురువారం ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. విజయనగరం జిల్లా పునర్విభజనకు సంబంధించి మాట్లాడుతూ పూర్వ విజయనగరం జిల్లాలోని 34 మండలాలకు, ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న 11 మండలాలకు ఉద్యోగుల కేటాయింపును విజయనగరం జిల్లా నుంచే చేపట్టాలని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరంలో విలీననమైన 4 మండలాల ఉద్యోగుల కేటాయింపును శ్రీకాకుళం జిల్లా నుంచే నిర్వహించాలని తెలిపారు. ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం జూలై 16న డ్రాఫ్ట్ సీనియారిటీ జాబితా విడుదల, 20 వరకు అభ్యంతరాల స్వీకరణ, 22న తుది సీనియార్టీ జాబితా విడుదల, 26 వరకు ఆప్షన్ల స్వీకరణ, 28న కేటాయింపు ఉత్తర్వులు, జూలై 30న కొత్త యూనిట్లలో చేరిక ఉత్తర్వులు జారీ చేసి, ఆగస్టు 5 లోపు ఉద్యోగులు కొత్త విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
● వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి జిల్లా అధికారులతో సమీక్షించారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్–2025, జీఓలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, వాటి ప్రకారం శాఖల వారీగా పూర్తి వివరాలతో నివేదికలను సిద్ధంచేసి శుక్రవారం నాటి సమీక్షా సమావేశానికి తీసుకురావాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ ఎస్.సేతుమాధవన్, డీఆర్‌ఓ సీహెచ్ సత్తిబాబు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.


