గంజాయి సాగు నిర్మూలన, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన
విజయనగరం క్రైమ్: విశాఖ రేంజ్ పరిధిలో ఉన్న ఐదు జిల్లాల్లో గంజాయి సాగును సమూలంగా నిర్మూలించామని ప్రత్యామ్నాయం కోసం ఉపాధి కల్పిస్తున్నట్లు విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి మంగళవారం తెలిపారు. ఈ మేరకు ఏడాదిలో గంజాయి సాగుపై తీసుకున్న చర్యలు, ఉపాధి కల్పనపై డీఐజీ వివరాలు వెల్లడించారు. గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలన, డ్రగ్ ఫ్రీ సొసైటీ లక్ష్యంగా చేపట్టిన సమగ్ర చర్యలు 2025 లో గణనీయమైన ఫలితాలను సాధించాయన్నారు.గంజాయి సాగు జరుగుతున్న ప్రాంతాలలో కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు రైతులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పిస్తున్నామన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల పంపిణీ కార్యక్రమం కింద 29,979 మంది రైతులను 29,839.5 ఎకరాల్లో సాగుచేయగా, 35,011.5 ఎకరాల్లో 34,012 మంది రైతులు వాస్తవంగా పంటలు సాగు చేశారన్నారు. ఈ ఏడాదిలో 0.10 ఎకరాల గంజాయి పంటను పూర్తిగా నాశనం చేశామని, ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి రవాణా నివారణతో పాటు హార్టికల్చర్, ఆక్వా కల్చర్, పౌల్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్‌లో విశాఖపట్నం/అనకాపల్లి జిల్లాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. అత్యాధునిక 4 డ్రోన్లతో 327 గ్రామాల్లో 14,870 ఎకరాలను సర్వే చేయగా, 138 గ్రామాల్లో గంజాయి సాగు జరుగుతోందని తెలిసిందన్నారు. 24 సీసీ కెమెరాలతో కూడిన చెక్ పోస్టులు, 362 డైనమిక్ తనిఖీ కేంద్రాల ద్వారా భారీగా గంజాయి, హషీష్ ఆయిల్ స్వాధీనం చేసుకుని వందలాది కేసుల్లో నిందితులను అరెస్టు చేశామన్నారు. గంజాయి నిల్వలను గుర్తించేందుకు 9 ప్రత్యేక డాగ్ స్క్వాడ్‌లను మోహరించి ప్రతి జిల్లాలో డి అడిక్షన్ సెంటర్లు పెట్టి డ్రోన్ ఆధారిత ఎన్డీపీఎస్ బీట్‌లతో హాట్‌స్పాట్‌లను గుర్తించి, వినియోగదారులపై కేసులు నమోదు చేయడంతో పాటు 244 మందిని వ్యసన విముక్తి కేంద్రాలకు పంపించామని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో డీడీసీ ద్వారా 67,000 కిలోల గంజాయి, 77.267 కిలోల హషీష్ ఆయిల్ ధ్వంసం చేసి మొత్తం 509 కేసులు నమోదు చేసి 1,390 మందిని అరెస్టు చేశామని, 28,423 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని 341 వాహనాలను సీజ్ చేశామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి వివరించారు.
విశాఖ రేంజ్ పోలీస్ డీఐజీ గోపీనాథ్ జెట్టి
గంజాయి సాగు నిర్మూలన, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన


