సమావేశమైన పోలీస్ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ
● త్వరలో కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి కొత్త భవనం
● సిబ్బంది ఆర్థిక అవసరాలను తీర్చేందుకే సొసైటీ
విజయనగరం క్రైమ్: పోలీస్ సిబ్బంది ఆర్థిక అవసరాలను తీర్చేందుకే జిల్లా పోలీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పని చేయాలని ఎస్పీ దామోదర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీసు ఉద్యోగుల కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సర్వసభ్య సమావేశం జరిగింది. పోలీసు సిబ్బంది సంక్షేమంలో భాగంగా వారి ఆర్థిక అవసరాలను తీర్చేందుకుకే జిల్లా పోలీసు ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ ఏర్పడిందని ఎస్పీ అన్నారు. తక్కువ వడ్డీతో కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా రుణాలను పొందే పోలీసు ఉద్యోగులు తమ పిల్లల చదువులు, వివాహాలు, గృహ నిర్మాణాలు, రిపేర్లు, అత్యవసర వైద్య ఖర్చులు ఇతర ఆర్థిక అవసరాలను తీర్చుకోగలుగుతున్నారని చెప్పారు. ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా 202425 ఏడాదిలో వచ్చిన ఆదాయ, వ్యయాలను, పోలీసు సంక్షేమానికి తీసుకున్న చర్యలను సొసైటీ సభ్యులకు వివరించామని తెలిపారు. పోలీసు ఉద్యోగులు తీసుకున్న సభ్యత్వం, సర్వీసు ఆధారంగా ఇప్పటికే రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలను వ్యక్తిగత రుణాలుగా, ఆడపిల్లల పెళ్లి నిమిత్తం రూ.8 లక్షలు అందజేస్తున్నామన్నారు. సొసైటీ సభ్యుల పిల్లలకు పదో తరగతి, ఇంటర్మీడియట్లో 90 % కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారికి మెరిట్ స్కాలర్‌షిప్‌లను కూడా అందజేస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే విజయనగరం జిల్లా పోలీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ మిగతా జిల్లాలకు ఆదర్శంగా ఉందన్నారు. త్వరలో జిల్లా కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి కొత్త భవనం నిర్మాణానికి చర్యలు చేపడతామని తెలిపారు. సమావేశంలో సొసైటీని మరింత అభివృద్ధి, ప్రగతి పథం వైపు నడిపించేందుకు సభ్యుల నుంచి సలహాలను, సూచనలను స్వీకరించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఏఆర్ డీఎస్పీ ఈ.కోటిరెడ్డి, ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఎస్.విద్యాసాగర్, ఆర్‌ఐలు ఎన్.గోపాల నాయుడు, రమేష్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, కోఆపరేటివ్ సెక్రటరీ ఎం.నీలకంఠం నాయుడు, డైరెక్టర్లు, కోఆపరేటివ్ సభ్యులు, పోలీసు కార్యాలయం ఉద్యోగులు పాల్గొన్నారు.


