ఏషియన్ గోల్డ్ మెడలిస్ట్‌ను సత్కరించిన జేసీ
విజయనగరం: దుబాయి వేదికగా ఇటీవల జరిగిన యూత్ ఏషియన్ పారా గేమ్స్–2025 పోటీల్లో బాడ్మింటన్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన జిల్లాకు చెందిన పారా (దివ్యాంగ) క్రీడాకారుడు పొట్నూరు ప్రేమ్‌చంద్‌ను జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ గురువారం తన కార్యాలయంలో అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాకు చెందిన పారా క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో రాణించి మెడల్స్ సాధించడం జిల్లా కు గర్వకారణమన్నారు. పారా క్రీడల ద్వారా దివ్యాంగులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక అవకాశాలను కల్పిస్తోందని దివ్యాంగులంతా అందిపుచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరరావు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి వి.రామస్వామి, జిల్లా గౌరవఅధ్యక్షుడు కె.దయానంద్, జాయింట్ సెక్రటరీ కర్రోతు లక్ష్మి, అంతర్జాతీయ బాడ్మింటన్ క్రీడాకారుడు యాళ్ల సత్తిబాబు, కోచ్‌లు, తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.


