సేవా పథంలో విద్యార్థి లోకం
● శ్రమదానంతో పాఠశాలల ప్రక్షాళన
పార్వతీపురం రూరల్:
సేవే పరమావధిగా..క్రమశిక్షణే ఆయుధంగా పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు సేవా పథంలో కదం దొక్కారు. మండలంలోని చినబొండపల్లి, ఎమ్మార్‌నగరం గ్రామాల్లో నిర్వహిహి స్తున్న ఎన్‌ఎస్‌ఎస్ 2,3 యూనిట్ల ప్రత్యేక శిబిరం బుధవారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. స్వచ్ఛతే సంపద అనే నినాదంతో తెల్లవారుజామునే క్షేత్రస్థాయిలోకి వెళ్లిన వలంటీర్లు, స్థానిక ప్రాథమిక పాఠశాల ఆవరణలోని వ్యర్థాలను తొలగించి శ్రమదానంతో పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. అనంతరం విద్యార్థుల్లో ఏకాగ్రతను, మానసిక వికాసాన్ని పెంపొందించేందుకు శ్రీరాములు నాయుడు, లలిత్ కుమార్ ప్రత్యేకంగా నిర్వహించిన ధ్యాన తరగతులు విద్యార్థులకు మనోల్లాసాన్ని పంచాయి. మధ్యాహ్నం వేళ నిర్వహించిన రంగవల్లుల పోటీలు పల్లె ముంగిళ్లలో రంగుల హరివిల్లులను కురిపించి అందరినీ కట్టుకున్నాయి. సేవాభావం, సృజనాత్మకత కలగలిసిన ఈ కార్యక్రమాలను ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు డి.తవిటినాయుడు, పీవీ సత్యానంద్ దగ్గరుండి పర్యవేక్షించి విద్యార్థులను సమన్వయ పరిచారు.


