కారు, లారీ ఢీకొని ఒకరి మృతి
పూసపాటిరేగ: మండలంలోని గుండపురెడ్డిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని కారు వెనుక నుంచి ఢీకొనడంతో కారులో ఉన్న వ్యక్తి తీవ్రగాయాల పాలై చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన పసుపులేటి దక్షిణామూర్తి (58) చీపురరుపల్లి నుంచి కారులో విశాఖపట్నం వెళ్తుండగా జీఆర్‌పాలెం సమీపంలో జాతీయరహదారిపై ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టడంతో కారులో ఉన్న దక్షిణామూర్తికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చగా పరిస్థితి విషమించడంతో గురువారం మృతిచెందాడు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం జిల్లాకేంద్రాస్పత్రికి తరలించారు. ఈ మేరకు పూసపాటిరేగ ఎస్సై ఐ.దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


