
స్ఫూర్తిప్రదాత.. ప్రకాశం పంతులు
విజయనగరం అర్బన్: స్వాతంత్య్ర సమర యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు స్ఫూర్తిప్రదాత అని, భవిష్యత్ తరాల వారికి ఆదర్శ ప్రాయులని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. ప్రకాశం పంతులు జయంతిని కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం ఘనంగా నిర్వహించారు. టంగుటూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతులు నిరుపేద కుటుంబంలో పుట్టి చదువులో రాణించి ఉన్నత స్థాయికి చేరుకున్నారన్నారు. టంగుటూరి 1952లో ఎస్.కోట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారని, ఆయనకు మన జిల్లాతో అనుబంధం ఉండడం గొప్పవిషయమన్నారు. కార్యక్రమంలో జేసీ సేతు మాధవన్, డీఆర్వో శ్రీనివాసరావు, సీపీఓ బాలాజీ, జిల్లా వ్యవసాయ అధికారి తారక రామారావు, మార్క్‌ఫెడ్ డీఎం వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ ఏఓ తాడ్డి గోవింద, తదితరులు పాల్గొన్నారు.
స్మార్ట్ రేషన్ కార్డులు
● ఈనెల 25 నుంచి డిపోల వద్ద పంపిణీ
● డీలర్లకు అందించిన తహసీల్దార్లు
రాజాం: కూటమి ప్రభుత్వం పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా స్మార్ట్ కార్డులు తీసుకొచ్చింది. ఏటీఎం కార్డు మాదిరిగా ఉండే ఈ కార్డులను ప్రతిరేషన్ కార్డు యజమానికి అందించనుంది. ఇప్పటికే ఈ కార్డులను జిల్లాలోని అన్ని రేషన్ డిపోల డీలర్లకు అందజేశారు. ఈ నెల 25 నుంచి గ్రామాల్లో వీటిని లబ్ధిదారులకు అందించనున్నారు.
జిల్లా వ్యాప్తంగా 5.71 లక్షలకు పైగా..
జిల్లా వ్యాప్తంగా 1249 రేషన్ షాపులకు సంబంధించి 5,71,358 కొత్త రేషన్ స్మార్ట్ కార్డులను జిల్లా ప్రజా పంపిణీ వ్యవస్థ తహసీల్దార్లకు అందజేసింది. వీటిని గ్రామాల్లో అందించేందుకు పక్కా ఏర్పాట్లు చేసింది. ఈ కార్డుకు ముందుభాగంలో ఇంటి యజమాని పేరు, వివరాలు ఉంటాయి. క్యూఆర్ కోడ్ సిస్టం ఏర్పాటుచేశారు. రెండోవైపు కుటుంబ సభ్యుల వివరాలు నమోదుచేశారు. జిల్లాలో కొత్తగా 50 వేలకుపైగా రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉండగా, వాటిని పక్కన పెట్టి పాత కార్డులు ఉంటుండగా స్మార్ట్ కార్డులు ఇవ్వడమేమిటని కొందరు విమర్శిస్తున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వాపోతున్నారు.

స్ఫూర్తిప్రదాత.. ప్రకాశం పంతులు