
ఉత్తరాంధ్ర మంత్రుల పేర్లు మిస్సింగ్
బాబు ర్యాంకర్ల జాబితాలో కానరాని అచ్చెన్న, కొండపల్లి, సంధ్యారాణి
● బాబు ర్యాంకర్ల జాబితాలో కానరాని అచ్చెన్న, కొండపల్లి, సంధ్యారాణి
సాక్షి ప్రతినిధి,విజయనగరం:
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు తాను ఒక కార్పొరేట్ కంపెనీ సీఈఓగా భావించుకుంటూ మంత్రులను సెకెండ్ క్యాడర్ ఉద్యోగులుగా చూస్తూ వారి పనితీరును మదింపు చేస్తూ ర్యాంకింగులు ఇవ్వడం చాన్నాళ్లుగా ఉన్న అలవాటు. ఇదే క్రమంలో ఈసారి కూడా మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. ఇందులో భాగంగా ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అత్యద్భుత పని తీరు కనబరచిన వారు అంటూ ఐదుగురు మంత్రులతో టాప్–5 జాబితా ప్రకటించారు. అందులో జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ రెండో స్థానం, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో ఉన్నారు. నాలుగో స్థానంలో హోం మంత్రి అనిత, ఐదో స్థానంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చోటు దక్కించుకున్నారు. దాదాపు పాతికమంది మంత్రులు ఉన్న క్యాబినెట్లో కేవలం ఐదుగురికి మాత్రమే ర్యాంకుల కేటాయించిన సీఎం మిగతా వారిని పక్కనపెట్టినట్లుగా తెలుస్తోంది. పవన్‌కల్యాణ్ పేరు కూడా ఈ జాబితాలో కనిపించలేదు. ఆయనను పనితీరు విషయంలో పరిగణనలోకి తీసుకోలేదో, ఆయన ర్యాంకులకు అతీతం అనుకున్నారో కానీ పవన్ మాత్రం లిస్టులో లేరు. ఇక విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి ముగ్గురు మంత్రులు ఉన్నా వారెవరూ లిస్ట్‌లో లేరు. ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి సాలూరు ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉండగా, గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ చిన్న, కుటీర పరిశ్రమలు, ప్రవాస భారతీయుల వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. ఇక శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు వ్యవసాయమంత్రిగా కొనసాగుతున్నారు. గత ఫిబ్రవరిలో కూడా ర్యాంకులు ప్రకటించగా అందులో కొండపల్లి శ్రీనివాస్ మూడో స్థానంలో నిలిచారు. అసెంబ్లీకి తొలిసారి ఎన్నికై , ఏకంగా మంత్రి పదవి దక్కించుకున్న కొండపల్లి కొత్తవారైనా మంచి పనితీరుతో సీనియర్లను దాటుకుని మూడో స్థానంలో నిలిచారని అప్పట్లో చెప్పుకున్నారు. అప్పట్లో అచ్చెన్నాయుడు 17, సంధ్యారాణి 18 ర్యాంకుల్లో నిలిచారు. అయితే, ఇప్పుడు కేవలం ఐదు ర్యాంకులు మాత్రమే ప్రకటించడంలో ఈ మంత్రులు ఎవరికీ పాపం అందులో స్థానం దక్కలేదు.

ఉత్తరాంధ్ర మంత్రుల పేర్లు మిస్సింగ్

ఉత్తరాంధ్ర మంత్రుల పేర్లు మిస్సింగ్

ఉత్తరాంధ్ర మంత్రుల పేర్లు మిస్సింగ్