
దివ్యాంగులకు అండగా వైఎస్సార్‌సీపీ
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు,
జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
బొబ్బిలి: రాష్ట్రంలో కొత్తగా వితంతువులు, వృద్ధులు, నిరుపేద వర్గాలవారికి ఒక్క పింఛన్ మంజూరు చేయకుండా, గత ప్రభుత్వం మంజూరు చేసిన దివ్యాంగుల పింఛన్ల తొలగింపుకు కూటమి ప్రభుత్వం పూనుకోవడం దారుణమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. బొబ్బిలిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి పాలనలో సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని, కోతలే కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఏడాది పాలనలో 4లక్షల పింఛన్లను నిలివేయగా, జిల్లాలో 80వేల పింఛన్లు తొలగించిన ఘనత కూటమిదేనన్నారు. దివ్యాంగులు దేవుడు బిడ్డలని, వారికి అండగా ఉండి ఆదుకోవాల్సిన ప్రభుత్వం కక్షసాధిస్తోందన్నారు. దివ్యాంగులకు అండగా వైఎస్సార్‌సీపీ ఉంటుందని స్పష్టంచేశారు. యూరియా కోసం రైతులు నానా పాట్లు పడాల్సి వస్తోందన్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడమే ఎరువు కష్టాలకు ప్రధాన కారణమన్నారు.
నిరుద్యోగ భృతి ఏదీ?
ఎన్నికల ముందు ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్న కూటమి నాయకులు ఇప్పుడు ఏం మాట్లాడడం లేదన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారన్నారు. 16 నెలల్లో ఎంతమందికి నిరుద్యోగ భృతి చెల్లించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉచితమంటూ ఐదు సర్వీసులా?
మహిళల కోసం రాష్ట్రమంతా ఉచితంగా ప్రయాణం అంటూ చెప్పారని, ఇప్పుడు కేవలం 5 సర్వీసులతోనే బస్సులు నడుపుతున్నారని, దీంతో మహిళంతా అదే బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణాలు చేయాల్సి వస్తోందన్నారు. ఉచిత బస్సు ఓ బూటమన్నారు. సంపద సృష్టిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం 16 నెలల కాలంలో లక్షా 70వేల కోట్ల అప్పుచేసిందన్నారు. ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని పక్కనపెట్టేసిందన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకటచినప్పలనాయుడు, జెడ్పీటీసీ సభ్యులు ఽసంకిలి శాంతకుమారి, పట్టణ అధ్యక్షులు చోడిగంజి రమేష్‌నాయుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ సావు మురళీ కృష్ణ, తూముల భాస్కరరావు, ఇంటి గోపాలరావు, అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.