● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
డెంకాడ:
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రజలందరి సామాజిక బాధ్యత అని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. పినతాడివాడ గ్రామంలో శనివారం జరిగిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. సచివాలయ ప్రాంగణంలో మొక్కను నాటారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. స్వచ్ఛాంధ్ర సాధనకు అందరూ కలిసికట్టుగా కృషి చేస్తామని సభికులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. గ్రీన్ అంబాసిడర్లను సన్మానించారు. గ్రామంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయం వద్ద నిర్వహించిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల పరిశుభ్రత, స్వచ్ఛతే స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. ఫాగింగ్ మిషన్ల వినియోగంపై ప్రతి పంచాయతీలో శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ, డీపీఓ మల్లికార్జునరావు, డీఎంహెచ్‌ఓ ఎస్.జీవనరాణి, ఎంపీపీ బి.వాసుదేవరావు, మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖరరావు, సర్పంచ్ లెంక లక్ష్మణరావు, మాజీ సర్పంచ్ పల్లె భాస్కరరావు, ఎంపీటీసీ సభ్యుడు విజినిగిరి అచ్చుంనాయుడు, ఎంపీడీఓ వై.భవాని, తహసీల్దార్ రాజారావు, ఈఓపీఆర్‌డీ శ్రీనివాసరావు, మెడికల్ ఆఫీసర్ రామకృష్ణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.