● విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
● కన్నీరుమున్నీరుగా విలపించిన కుటుంబ సభ్యులు
రామభద్రపురం: విద్యుదాఘాతంతో తండ్రి మృతి చెందగా.. అతని చేయి పట్టుకుని లే నాన్న.. లే అంటూ కుమారుడు రోదించిన తీరు చూసి అక్కడున్న వారంతా కంటతడి పెట్టారు. మృతదేహంపై పడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించడంతో ఆ ప్రాంతంలో విషాధఛాయలు అలముకున్నాయి. మండలంలోని జగనన్న కాలనీ సమీపంలో ఉన్న ఆల్ట్రాటెక్ సిమెంట్ గోదాం వద్ద విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలియజేసిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని జన్నివలస గ్రామానికి చెందిన ముచ్చుపల్లి శ్రీనివాసరావు అల్ట్రాటెక్ సిమెంట్ గోదాంలో కలాసీగా పనిచేస్తున్నాడు. అయితే సాయంత్రం పని ముగిసిన తర్వాత గోదాం వద్ద జీ వైర్‌పై ఆరబెట్టిన దుస్తులు తీసుకుంటుండగా విద్యుత్ షాక్ కొట్టింది. జీ వైర్‌కు పక్కనున్న విద్యుత్ స్తంభం వస్తున్న సర్వీస్ తీగ తగలడంతో విద్యుత్ ప్రవాహం జరిగి శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య మంగ, కుమారులు రాము, హర్ష ఉన్నారు. రాము ఇంటర్మీడియట్, హర్ష పదో తరగతి చదువుతున్నారు. శ్రీనివాసరావు సంపాదన మీదే కుటుంబం ఆధారపడి ఉండడంతో.. ఇకపై ఎలా బతికేదంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై వి. ప్రసాదరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే యజమాని నిర్లక్ష్యం కారణంగానే శ్రీనివాసరావు మృతి చెందాడని స్థానికులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు.
నాన్నా..లే నాన్న..