
నదీ తీరంలో హెచ్చరిక బోర్డులు : సబ్ కలెక్టర్
భామిని: మండలంలోని లివిరి వద్ద వంశధార నదిలో కుమ్మరి లక్ష్మి అనే మహిళ గల్లంతు కాగా ఆ నదీతీరాన్ని పాలకొండ సబ్‌కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ ఆదివారం పరిశీలించారు. మహిళ గల్లంతు ఘటనపై ఆరాతీశారు. తహసీల్దారు శివన్నారాయణ ఆధ్వర్యంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు నదిలో జల్లెడ పడుతున్నా మహిళ ఆచూకీ లభ్యం కాలేదని అధికారులు తెలిపారు. ప్రమాదకరంగా ఉండే ఇటువంటి నదీతీరాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని తహసీల్దారును సబ్‌కలెక్టర్ ఆదేశించారు. ఆదివారమూ ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ప్రత్యేక బోటు వేసుకుని మరీ నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.
వేధింపుల వల్లే ఆత్మహత్య
గజపతినగరం రూరల్: మండలంలోని పిడిశీలకు చెందిన కర్రోతు సాయిసుధ ఆత్మహత్యకు ప్రియుడి వేధింపులే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సాయిసుధకు అదే గ్రామానికి చెందిన యడ్ల ఈశ్వరరావుతో 11 ఏళ్లుగా పరిచయం ఉందన్నారు. కొద్దిరోజులుగా ఈశ్వరరావు నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో సాయిసుధ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.