దాడి కేసులో నిందితుడి అరెస్ట్
విజయనగరం క్రైమ్: రెండు రోజుల కిందట యువతిపై దాడి చేసిన నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడ్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గరివిడి మండలం శివరాం గ్రామంలో ఉంటున్న బాధిత యువతికి తన అన్న ద్వారా నిందితుడు గర్ల ఆదినారాయణతో పరిచయం ఉంది. నిందితుడు తరచూ బాధిత యువతి ఇంటికి వస్తుంటాడు. ఇదిలా ఉంటే బాధిత యువతి చెల్లెలు విజయవాడలో ఉంటోంది. నిందితుడు ఫోన్ ద్వారా ఆమెతో కూడా పరిచయం పెంచుకున్నాడు. కొద్ది రోజలుగా నిందితుడు ఆదినారాయణ ఫోన్‌లో బాధితురాలి చెల్లిని అసభ్య పదజాలంతో వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె శివరాంలో ఉంటున్న సోదరికి చెప్పుకుంది. దీంతో బాధితురాలు తన చెల్లిని ఎందుకు వేధిస్తున్నావని ఆదినారాయణను నిలదీసింది. అలాగే చుట్టుపక్కల వాళ్లకు కూడా చెప్పడంతో ఆదినారాయణ బాధిత యువతితో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీన ఇంటిలో వంటపాత్రలు శుభ్రం చేస్తున్న బాధిత యువతిపై నిందితుడు కత్తితో దాడి చేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడ్ని పట్టుకునేందుకు ఐదు బృందాలను రంగంలోకి దించింది. గంటల వ్యవధిలో నిందితుడు పట్టుబడడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని త్వరగా పట్టుకున్న నేపథ్యంలో చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు, గరివిడి ఎస్సై లోకేశ్వరరావులను ఎస్పీ అభినందించారు.


