చంద్రబాబు మంత్రివర్గంలో చోటుదక్కని సీనియర్లు చంద్రబాబు మంత్రివర్గంలో చోటుదక్కని సీనియర్లు | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మంత్రివర్గంలో చోటుదక్కని సీనియర్లు

Jun 13 2024 1:36 AM | Updated on Jun 13 2024 1:21 PM

-

 మంత్రి పదవిపై   కళా వెంకటరావు, కోండ్రు మురళీ, కోళ్ల లలితకుమారి ఆశలు 

 లోకేశ్‌ సాన్నిహిత్యంతో కొండపల్లికి మంత్రి పదవి  

అసెంబ్లీలో తొలిసారిగా  అడుగుపెడుతూనే మంత్రిగా అవకాశం 

ఎస్టీ కోటాలో గుమ్మడి సంధ్యారాణికి కేబినెట్‌లో చోటు  

వారంతా రాజకీయాల్లో సీనియర్లు. గెలిస్తే మంత్రి పదవి తమకే వస్తుందని గట్టిగా నమ్మారు. ఎన్నికల ప్రచార సభలు, సమీక్షల్లో పార్టీ శ్రేణుల వద్ద అదే విషయాన్ని పదేపదే ప్రస్తావించారు. తీరా గెలిచాక మంత్రి పదవులు వరించకపోవడం.. కొత్తగా ఎన్నికైన వారికే చంద్రబాబు ప్రభుత్వం పట్టంకట్టడం ప్రస్తుతం జిల్లాలోని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  

సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాజాంలో తనను గెలిపిస్తే టీడీపీ ప్రభుత్వంలో మంత్రినవుతానన్న కోండ్రు మురళీమోహన్‌ మాటలు నెగ్గలేదు... చీపురుపల్లిలో సీనియర్‌ నాయకుడైన బొత్స సత్యనారాయణను ఓడించి వస్తే మంత్రి పదవి కచ్చితంగా ఇస్తామని కళావెంకటరావుకు చంద్రబాబు ఇచ్చిన హామీ పనిచేయలేదు... శృంగవరపుకోటలో మూడోసారి గెలిస్తే సామాజికవర్గ సమీకరణాల్లో తనకు మంత్రి పదవి వస్తుందనుకున్న కోళ్ల లలితకుమారి కలలు నెరవేరలేదు... తొలిసారిగా ఎమ్మెల్యే అయినా ఏదో ఒక లెక్కలో తమకు జాక్‌పాట్‌ తగలకపోతుందా అని ఆశించిన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి లెక్కలూ ఫలితమివ్వలేదు. లోకేశ్‌తో సాన్నిహిత్యం, తన భార్యవైపు సంబంధాలతో చాపకింద నీరులా పనిచేసుకున్న కొండపల్లి శ్రీనివాస్‌ గజపతినగరం టీడీపీ టికెట్‌ దక్కించుకోవడంలోనే కాదు చంద్రబాబు మంత్రివర్గంలో చోటు సంపాదించడంలోనూ సఫలమయ్యారు. విజయనగరం జిల్లా నుంచి ఏకైక మంత్రి అయ్యా రు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి ఎస్టీ కోటాలో మంత్రి పదవి దక్కించుకున్నారు.

కోండ్రు ఆశలపై నీళ్లు...
రాజాం (ఎస్సీ) నియోజకవర్గంలో 2009లో వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి చలువతో ఎమ్మెల్యేగా గెలిచిన కోండ్రు మురళీమోహన్‌ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా నిర్వహించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేస్తే కేవలం 4,790 ఓట్లే వచ్చాయి. టీడీపీ తీర్థం పుచ్చుకొని 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసినా వైఎస్సార్‌సీపీ నాయకుడు కంబాల జోగులు చేతిలో చావుదెబ్బ తప్పలేదు. అప్పటివరకూ పోటీగా ఉన్న సీనియర్‌ నాయకురాలు ప్రతిభాభారతి ఆరోగ్య కారణాల రీత్యా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవడంతో కోండ్రు పని సులువైంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు. తాను గెలిస్తే చంద్రబాబు కేబినెట్‌లో తనకు చోటు ఖాయ మని ప్రచారం చేసుకున్న ఆయనకు ఇప్పుడు నిరాశే మిగిలింది. ఎస్సీ కోటాలో కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆశించినా చివరకు హడావుడే మిగిలింది.

ఎందు‘కళా’..?
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన టీడీపీ సీనియర్‌ నాయకుడు, విజయనగరం జిల్లా కొచ్చి చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ వంటి సీనియర్‌ నాయకుడిపై గెలిచిన కిమిడి కళావెంకటరావుకు ఈసారి చంద్రబాబు మంత్రివర్గంలో చోటు తప్పక ఉంటుందని ఆయన అనుచరులు అంతా కోటి ఆశలు పెట్టుకున్నారు. 1983లో రాజకీయ ఆరంగేట్రం చేసిన తర్వాత నుంచీ టీడీపీ అభ్యర్థిగా ఉణుకూరు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఉణుకూరు రద్దు అయిన తర్వాత ఎచ్చెర్ల నియోజకవర్గానికి మారిన ఆయన 2009 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీచేసి ఓడిపోయారు.

2014లో మళ్లీ టీడీపీ నుంచి పోటీచేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేసి బొత్స సత్యనారాయణపై విజయం సాధించారు. ఇలా ఆరుసార్లు ఎమ్మెల్యే, గతంలో రెండుసార్లు మంత్రిగా బాధ్యతలు, 1998–2004 వరకూ రాజ్యసభ సభ్యుడిగా సేవలు, అంతకుమించి టీడీపీ రాష్ట్ర శాఖకు తొలి అధ్యక్షుడిగా పనిచేసిన కళాకు ఈసారి కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. ఆయనకు చోటు దక్కకపోవడంతో అనుచరులంతా డీలా పడిపోయారు. స్పీకర్‌ పదవి వరిస్తుందనే ప్రచారం జరుగుతున్నా అది ఎంతవరకూ కార్యరూపం దాల్చుతుందో చూడాలి.

‘కోళ్ల’ ఆశలు ఆవిరి
విజయనగరం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా ల్లో బలీయమైన సామాజికవర్గం నుంచి కోళ్ల లలితకుమారి ఒక్కరే ఈసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. టీడీపీ సీనియర్‌ నాయకుడు కోళ్ల అప్పలనాయుడి కోడలుగా, రాజకీయ వారసురాలిగా శృంగవరపుకోట నియోజకవర్గంలో మూడో సారి గెలిచిన ఆమె ఈసారైనా తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు. ఆమెకే కాదు ఆమె సామాజికవర్గం నుంచి మరే ఎమ్మెల్యేకూ ఈసారి చంద్రబాబు మంత్రివర్గంలో చోటు లభించలేదు. దీంతో ఆ సామాజికవర్గ నాయకులంతా గుర్రుగా ఉన్నారు.

తొలిసారి గెలిచినా...
బొబ్బిలి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన బేబీనాయనకు మంత్రి పదవి వస్తుందనే ప్రచారం జరిగింది. ఎందుకో ఆయన పేరు పరిశీలనలోనే లేకుండాపోయింది. విజయనగరం నుంచి రెండో సారి పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెడుతున్న అదితి గజపతిరాజుకు కూడా తన తండ్రి అశోక్‌ గజపతిరాజు కోటాలో మంత్రి పదవి వస్తుందని బంగ్లా అభిమానులంతా ఆశలు పెట్టుకున్నారు. కానీ రాజకీయ అస్త్రసన్యాసం చేసిన అశోక్‌ను ఏదైనా రాష్ట్రానికి గవర్నర్‌ను చేయించాలని అధిష్టానం ఆలోచిస్తోందట. దీంతో అదితికి మంత్రి పదవి అవకాశం లేకుండాపోయింది. జనసేన ఎమ్మెల్యేల్లో ఏకై క మహిళ నాయకురాలిగా ఆ పార్టీ కోటాలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవికి మంత్రి పదవి వస్తుందని ఆమె అభిమానులు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. తుదకు గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్‌కు తూర్పుకాపు కోటాలో, సాలూరు ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణికి ఎస్టీ కోటాలో మంత్రి పదవులు దక్కాయి.

మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్‌  
నియోజకవర్గం: 
గజపతినగరం (తొలిసారి 
ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు) 
వయస్సు: 42 సంవత్సరాలు 
విద్యార్హత: ఎంఎస్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) 
స్వగ్రామం: గంట్యాడ 
కుటుంబం:  భార్య: లక్ష్మీసింధు (గృహిణి) 
పిల్లలు: విహాన్‌ (కుమారుడు), మేధ (కుమార్తె) 
తాత : కొండపల్లి పైడితల్లి నాయుడు (రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, ఒకసారి జెడ్పీ 
చైర్మన్‌గా పనిచేశారు) 
తండ్రి : కొండపల్లి కొండలరావు (రెండుసార్లు గంట్యాడ ఎంపీపీగా పనిచేశారు) 
చిన్నాన్న: కొండపల్లి అప్పలనాయుడు (2014–19లో టీడీపీ ఎమ్మెల్యేగా చేశారు) 
పూర్వాశ్రమం: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా అమెరికా, యూఏఈ, ఈజిప్ట్‌ తదితర దేశాల్లో 
పనిచేశారు.  

మంత్రి గుమ్మడి సంధ్యారాణి రాజకీయ ప్రస్థానం   
నియోజకవర్గం: సాలూరు (తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు) 
వయస్సు: 50 సంవత్సరాలు 
విద్యార్హత: బీఎస్సీ 
స్వగ్రామం: సాలూరు 
కుటుంబం:  
తండ్రి : జన్ని ముత్యాలు (1972–78 వరకూ కాంగ్రెస్‌ పారీ్టలో ఎమ్మెల్యేగా పనిచేశారు) 
తల్లి: జన్ని పార్వతమ్మ 
భర్త: గుమ్మడి జయకుమార్‌ 
పిల్లలు: పృధ్వీ (కుమారుడు), ప్రణతి (కుమార్తె) 

పూర్వాశ్రమం: కాంగ్రెస్‌ పార్టీ సాలూరు నియోజకవర్గ ఇంచార్జిగా 1999లో రాజకీయాల్లోకి వచ్చారు. అదే సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసి అప్పటి టీడీపీ అభ్యర్థి ఆర్‌పీ భంజ్‌దేవ్‌ చేతిలో ఓడిపోయారు. 2009 
సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి నాటి కాంగ్రెస్‌ అభ్యర్థి పీడిక రాజన్నదొర చేతిలో ఓడిపోయారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అరకు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థిగా పోటీచేసినా మళ్లీ ఓటమి తప్పలేదు. 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆమెను ఎమ్మెల్సీగా చేసింది. 2021 వరకూ ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు. తర్వాత నుంచి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా కొనసాగుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 
అభ్యర్థి పీడిక రాజన్నదొరపై గెలుపొందారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆమెకు చంద్రబాబు మంత్రివర్గంలోనూ చోటు దక్కింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement