
మొక్కజొన్న తోటల్లో బిందుసేద్యం పరికరాలను పరిశీలిస్తున్న అధికారులు
● 50 నుంచి 90 శాతం రాయితీపై బిందు, తుంపర సేద్యం పరికరాలు ● చిన్న, సన్నకారు రైతులకు అధిక ప్రాధాన్యం ● రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన సాగు విస్తీర్ణం 1800 హెక్టార్లు ● 425 హెక్టార్లలో సూక్ష్మ సేద్య పరికరాల అమరిక ● పరికరాల కోసం రూ.11.35 కోట్ల ఖర్చు
పాలకొండ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు అనుక్షణం అండగా నిలుస్తోంది. మారుతున్న యాంత్రిక యుగంలో సాంకేతికతను అందిపుచ్చుకుని వినూత్న విధానాల్లో సాగు చేపట్టేలా చిన్న, సన్నకారు రైతులను ప్రోత్సహిస్తోంది. తక్కువ పెట్టుబడితో అధిక విస్తీర్ణంలో పంటలు సాగుకు అనువుగా 50 నుంచి 90 శాతం రాయితీపై సూక్ష్మసేద్యం పరికరాలు సమకూర్చుతోంది. ఎకరా నుంచి 5 ఎకరాల భూమి గల రైతులకు 55 శాతం, 5 నుంచి 12.50 భూమి గల రైతులకు 45 శాతం రాయితీపై స్ప్రింక్లర్ల యంత్రాలు అందిస్తోంది. గిరిజన రైతులకు 90 శాతం రాయితీని కల్పిస్తోంది. జిల్లాలో ప్రస్తుతం1800 వందల హెక్టార్లలో బిందు, తుంపర సేద్యానికి సంబంధించి రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటిలో 425 హెక్టార్లలో రాయితీ పరికరాల అమరిక పనులను అధికారులు పూర్తి చేశారు. 12 వందల మంది రైతులకు లబ్ధికల్పించేలా సుమారు రూ.11.35 కోట్ల నిధులతో రాయితీ పరికరాలు సమకూర్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. మరో 600 హెక్టార్లలో పరికరాలు అమర్చేందుకు చర్యలు చేపట్టింది.
లాభాలు బోలెడు..
జిల్లాలోని నేలలు సూక్ష్మసేద్యానికి అనువైనవి. పామాయిల్, అరటి, మామిడి, బత్తాయి, నిమ్మ, సపోటా, కూరగాయలు, మిరప, చెరకు, వేరుశనగ, మినుము పంటలను బిందు, తుంపర సేద్యంతో సాగుచేయవచ్చు. విద్యుత్, నీటిని పొదుపుగా వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎరువులు, పురుగుమందుల యాజమాన్యం సులభం. పంట దిగుబడులు ఆశాజనంగా ఉంటాయి.
బిందు సేద్యం పరికరాలకు రాయితీలు ఇలా....
ఐదెకరాలలోపు భూమి ఉన్న సన్న, చిన్నకారు రైతు లు 90 శాతం రాయితీతో డ్రిప్ పరికరాలు పొందవ చ్చు. ఒక్కో రైతుకు గరిష్టంగా రూ.2.18 లక్షల వరకు రాయితీ వస్తుంది. ఐదు నుంచి 12.50 ఎకరాల భూ మి గల రైతులు 50 శాతం రాయితీతో బిందుసేద్యం పరికరాలు తీసుకోవచ్చు. ఒక్కో రైతుకు గరిష్టంగా రూ.3.10 లక్షల వరకు రాయితీ వర్తిస్తుంది.
తుంపర సేద్యం (స్ప్రింక్లర్లు)పై రాయితీ ఇలా.....
సన్న, చిన్నకారు రైతులు స్ప్రింక్లర్ పరికరాలను 55 శాతం రాయితీపై పొందవచ్చు. ఐదు నుంచి 12.50 ఎకరాల రైతులకు 45 శాతం రాయితీపై పరికరాలు తీసుకోవచ్చు. రాయితీపై డ్రిప్, స్ప్రింక్లర్లు తీసుకున్న రైతులు 7ఏళ్ల తర్వాత రెండో పర్యాయం సబ్సిడీపై పరికరాలు పొందే వెసులుబాటు కల్పిస్తున్నారు.
రైతులకు మేలు
క్షేత్ర స్థాయిలో రైతులకు అ వగాహన కల్పిస్తున్నాం. ఆర్బీకేల ద్వారా ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకు ని నిబంధనల మేరకు నగదుచెల్లిస్తే ఫిబ్రవరి రెండవ వారంలో పరికరాలు అందిస్తాం. దరఖాస్తు చేసే సమయంలో ఏ కంపెనీ పరి కరాలు కావాలో రైతులు ఎంచుకోవచ్చు. ఎంపిక చేసుకున్న కంపెనీ ద్వారానే డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు పొలంలో అమరిక చేయిస్తాం. ప్రస్తుతం జిల్లాలో ఫినోలెక్స్, రుమ్‌ంతా, నెటాఫిమ్ కంపెనీలకు చెందిన సూక్ష్మసేద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి. సూక్ష్మసేద్యం రైతుకు లాభదాయకం. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
– కె.సత్యనారాయణ రెడ్డి, సూక్ష్మ సేద్యం
పథక సంచాలకుడు, పార్వతీపురం మన్యం జిల్లా
దరఖాస్తు చేసుకునే విధానం....
రైతులు తమ ఆధార్ కార్డు, తహసీల్దార్ ద్వారా ధ్రువీకరించబడిన భూమి యాజమాన్య పత్రం, వన్‌బీ రికార్డుతో రైతు భరోసా (ఆర్బీకే) కేంద్రంలో బయోమెట్రిక్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ సమయంలోనే పరికరాలు పొంద దలచిన కంపెనీ పేరును నమోదు చేయించాలి.
దరఖాస్తులో తప్పనిసరిగా రైతు తన సెల్ నంబర్ నమోదు చేయాలి. సబ్సిడీ, నాన్ సబ్సిడీ వివరాలను నేరుగా రైతు ఫోన్‌కు మెసేజ్ ద్వారా తెలియజేస్తారు.
వెబ్ ల్యాండ్ పోర్టల్‌లో చేర్చిన పొలం విస్తీర్ణం ఆధారంగా సబ్బిడీ అర్హత నిర్ణయిస్తారు.

బంతితోటకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన సూక్ష్మసేద్యం పరికరాలు
