
హత్య జరిగిన స్క్రాప్ షాప్ ఇదే..(ఇన్‌సెట్లో) మృతిచెందిన అప్పలనాయుడు
● హత్యకు గురైన వాచ్‌మన్ ● గునపంతో అడ్డగా తలపై మోది, కిరాతకంగా చంపేసిన వైనం ● పోలీసుల అదుపులో నిందితుడు
విజయనగరం క్రైమ్: స్క్రాప్ షాపులో ఉన్న వస్తువులను దొంగలించవద్దని మందలించినందుకు వాచ్‌మన్‌ను అతి దారుణంగా చంపేశాడు. మద్యం మత్తులో గునపంతో తలపై మోది, ఛిద్రం చేశాడు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇండస్ట్రియల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి రూరల్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
వీటీ అగ్రహారానికి చెందిన బంటుపల్లి అప్పలనాయుడు (61) కొన్నేళ్లుగా ఇండస్ట్రియల్ ప్రాంతంలోని ఓ స్క్రాప్ షాపులో వాచ్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అదే షాపులో బీహార్ నుంచి వచ్చిన కూలీలు పనిచేస్తున్నారు. వారిలో ఒకడైన మంజి కునాల్ జల్సాలకు డబ్బులు సరిపడకపోవడంతో షాపు నుంచి స్క్రాప్ సామగ్రిని దొంగలించేందుకు ప్రయత్నిస్తుండగా వాచ్‌మన్ అప్పలనాయుడు మందలించాడు. దీంతో కునాల్ వృద్ధుడిపై చేయిచేసుకున్నాడు. అది చూసిన కూలీలు అతనిని నిలువరించారు. చంపేస్తానని బెదిరిస్తూ కునాల్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. వృద్ధుడి భార్య, కుమారుడు అక్కడకు వచ్చి ఇంటికి వెళ్లిపోదామని చెప్పారు. తగాదా ఏమీ ఉండదనుకుని వృద్ధుడు షాప్ షెట్టర్ తాళం వేసుకుని లోపల మడత మంచంపై పడుకున్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత పూర్తిగా మద్యం సేవించి వచ్చిన కునాల్ గోడదూకి లోపలకు వెళ్లాడు. అక్కడ ఉన్న గునపంతో వాచ్‌మన్‌పై దాడిచేసి తల ఛిద్రమయ్యేలా మోదాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ తర్వాత కునాల్ అక్కడ నుంచి పరారయ్యాడు. శనివారం ఉదయం తోటి వాచ్‌మన్‌లు అప్పలనాయుడుని టీకి పంపించాలని పిలిచారు. ఎంతకీ తలుపు తీయకపోవడంతో సందేహం వచ్చి అందులో ఒకరు గోడదూకి చూసేసరికి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే మృతుడి భార్య యశోద, కుమారుడు తరుణ్‌కు విషయం తెలియజేశారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన కునాల్‌ను రాత్రి తగాదాలో నువ్వే చంపేశావా అని అక్కడ పనిచేసిన కూలీలు ప్రశ్నించడంతో తనకేమీ తెలియదంటూ మెల్లగా జారుకున్నాడు. కొంతసేపటి తర్వాత వాడే హత్యచేసి ఉంటాడని అనుమానం వచ్చిన స్థానికులు అతని గదికి వెళ్లేసరికి అక్కడ నుంచి పరారయ్యాడు. వెంటనే రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి ఆధారాలను సేకరించింది. రూరల్ సీఐ టి.వి.తిరుపతిరావు, ఎస్‌ఐ గణేష్ రెండు బృందాలుగా విడిపోయి నిందితుడి కోసం గాలించారు. నిందితుడు విజయనగరం రైల్వేస్టేషన్‌లో రైలు ఎక్కుతుండగా ఎస్‌ఐ బృందం అదుపులోకి తీసుకుంది.


మృతుడు బంటుపల్లి అప్పలనాయుడు (ఫైల్)