దివ్యాంగత్వం 40 శాతం లోపుంటే పింఛన్ కట్
● డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసపాణి
రామభద్రపురం: ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం దివ్యాంగత్వం 40 శాతం లోపు ఉన్నవారికి పింఛన్ ఇవ్వబడదని డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసపాణి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రామభద్రపురం మండలం కొట్టక్కిలో నిర్మించిన వ్యవసాయ గోదాంను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు మంజూరువుతుందని, వితంతువులకు కొత్తగా పింఛన్ మంజూరుకు ఉత్తర్వులు రాలేదన్నారు. 40 శాతంలోపు దివ్యాంగత్వం ఉన్నవారు మళ్లీ సదరం ధ్రువపత్రం తెచ్చుకోవాలని నోటీసులు జారీచేశామన్నారు. జిల్లాలో 28 ఎఫ్‌పీఓల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. పంటల నిల్వకు వీలుగా గోదాంల నిర్మింస్తామని చెప్పారు.
వసతిగృహం
సదుపాయాలపై ఆరా
రామభద్రపురం: సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమమే లక్ష్యమని జిల్లా సోషల్ వెల్ఫేర్ డీడీ ఎం.అన్నపూర్ణ అన్నారు. రామభద్రపురంలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని మంగళవారం ఆమె సందర్శిచారు. వసతిగృహం ఆవరణతో పాటు రికార్డులు పరిశీలించారు. వంట గది నిర్వహణ, మెనూ అమలు తీరుపై ఆరా తీశారు. వేడివేడి భోజనం వడ్డించాలని వసతి గృహం నిర్వాహకుడు జి.వెంకటరమణకు సూచించారు. ప్రత్యేక తరగతుల నిర్వహణను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 30 వసతి గృహాలు 2,098 మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ట్యూటర్లను నియమించామని చెప్పారు. గతేడాది 97 శాతం ఫలితాలు సాధించామని, ఈ ఏడాది శతశాతం ఫలితాల సాధనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ట్యూటర్లకు ఈ ఏడాది జూలై నుంచి రెమ్యూన్‌రేషన్ రాలేదని, త్వరలో వచ్చే అవకాశం ఉందన్నారు.
వైభవంగా రాములోరి తిరువీధి
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీ సీతారామస్వామివారి తిరువీధి ఉత్సవాన్ని మంగళవారం సాయంత్రం నిర్వహించారు. వేద మంత్రోచ్ఛరణాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారిని పల్లకిలో గ్రామ పురవీధుల్లో ఊరేగింపుచేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
విజయనగరం అర్బన్: సంక్రాంతి పండగను పురస్కరించుకొని ఈ నెల 8 నుంచి 13వ తేదీ వరకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్టు జిల్లా ప్రజారవాణా అధికారి జి.వరలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రం నుంచి భీమవరం, కాకినాడ, రాజమండ్రి, రావులపాలెం, విజయవాడకు రాకపోకలు సాగించేందుకు వీలుగా సాధారణ చార్జీలతో ప్రత్యేక సర్వీసులు వేసినట్టు పేర్కొన్నారు. ‘ఏపీఎస్‌ఆర్‌టీసీఆన్‌లైన్.ఐఎన్’ వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం కల్పిస్తామన్నారు. ప్రయాణికులు రెండు వైపులా ఒకేసారి టికెట్ బుక్‌చేసుకుంటే 10 శాతం రాయితీ ఉంటుందని తెలిపారు.
దివ్యాంగత్వం 40 శాతం లోపుంటే పింఛన్ కట్
దివ్యాంగత్వం 40 శాతం లోపుంటే పింఛన్ కట్
దివ్యాంగత్వం 40 శాతం లోపుంటే పింఛన్ కట్


