రాత్రికిరాత్రే...
సాక్షిప్రతినిధి విజయనగరం:
మా రాజులు.. చేతికి ఎముక లేదు.. ఎక్కడ ఎవరు ఏది అడిగినా ఇచ్చేయడమే తప్ప.. ఏనాడూ ఎవర్ని చేయిచాచింది లేదు.. ఎక్కడ తప్పు చేసింది లేదు... అసలు తప్పు అనే పదమే బంగ్లాకు ఆమడ దూరంలో నిలిచిపోతుంది.. వందల ఎకరాలు విరాళాలుగా ఇచ్చేసిన వంశం వారిది.. అలాంటివారు తప్పు చేస్తారా.. తప్పు చేయిస్తారా.. ఎంత తప్పు.. ఇది ఇన్నాళ్లుగా ఉన్న ప్రచారం.. ఆర్భాటం. కాలం మారింది. పాలకులు మారుతున్నారు. సంప్రదాయాలు, దానగుణం కనుమరుగై స్వార్థం, అవినీతి పెరుగుతోంది. రూ.కోట్లు ప్రజాధనం కొల్లగొట్టి కోటకు చేర్చే ప్రయత్నాలు జోరందుకున్నాయి. జిల్లా కేంద్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
విజయనగరం పట్టణంలో ఏడెనిమిదేళ్ల కిందట రోడ్ల విస్తరణ ప్రక్రియ మొదలైంది. కోట వద్ద.. లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డు.. ఆనందగజపతి ఆడిటోరియం రోడ్డు.. గుమ్చి రోడ్డు.. ఇలా పలు ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ జరిగినప్పుడు ఆయా ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులు కూడా నష్టానికి గురయ్యాయి. దీని పరిహారం నిమిత్తం ప్రభుత్వం డబ్బు ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం వద్ద నిధులు లేని పరిస్థితుల్లో వారికి వారు కోల్పోయిన భూమికి రెండింతలు విలువగల పత్రాన్ని టీడీఆర్ రూపంలో ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఈ పత్రాన్ని సదరు స్థల యజమాని ఎవరికై నా అమ్ముకొని సొమ్ము చేసుకోవచ్చు. ఆ టీడీఆర్ పత్రంలోని విలువ మేరకు అపార్ట్‌మెంట్లు, గ్రూప్ హౌస్‌లు, ఇతర వాణిజ్య సముదాయాల్లో ఫ్లోర్లు వంటివి వేసుకొని వారు అమ్ముకోవచ్చు. టీడీఆర్ ఉద్దేశం ఇదే. అయితే నగరంలోని పలు రోడ్ల విస్తరణ సందర్భంగా తమకు చెందిన పలు ఆస్తులు కోల్పోయామని, వాటికి ఇప్పుడు టీడీఆర్ ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్‌ను ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది. ఏడెనిమిదేళ్ల కిందట జరిగిన రోడ్ల విస్తరణకు సంబంధించి ఇప్పటికిప్పుడు టీడీఆర్ ఇవ్వలేనని, దానికి ప్రభుత్వం వేసే కమిటీ అనుమతి మేరకు మాత్రమే మంజూరు చేస్తారని కమిషనర్ గట్టిగా చెప్పినట్లు తెలిసింది. దాదాపు రూ.20 కోట్ల విలువైన టీడీఆర్‌లను ఎలాగైనా తెప్పించుకోవాలనే ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వ పెద్దలు తమ మాట కమిషనర్ వద్ద చెల్లుబాటు కాకపోవడంతో పలు రకాలుగా ఒత్తిడిచేసినట్టు విశ్వసనీయ సమాచారం. జిల్లా అధికారితో చెప్పించినా కమిషనర్ కుదరని చెప్పడంతో గుంటూరులో జరిగిన తెలుగు మహాసభలకు హాజరైన రాజ్యాంగ పదవిలో ఉన్న ఓ పెద్దాయన.. అక్కడికక్కడే మున్సిపల్ శాఖ మంత్రితో మాట్లాడి కమిషనర్‌ను తప్పించినట్లు తెలుస్తోంది. తప్పుచేసేందుకు ఒప్పుకోని కమిషనర్‌ను అకస్మాత్తుగా బదిలీ చేయడం చూసి నగరవాసులు విస్తు పోతున్నారు. సహజంగా ఒక కమిషనర్‌ను, ఒక అధికారిని బదిలీ చేసినప్పుడు ఆయన స్థానంలో ఇంకొకరిని నియమిస్తారు.. లేదంటే ఆయన వచ్చేవరకు ఇంకో అధికారికి ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగిస్తారు. ఇక్కడ ఏమీ లేకుండానే నల్లనయ్యను ఉన్నఫలంగా బదిలీ చేసి తమ పొలిటికల్ పవర్ ఏమిటన్నది చూపించారన్న చర్చ సాగుతోంది. బంగ్లా ఒత్తిడికి తట్టుకుని ఉద్యోగాలు చేయడం కష్టమేనని, పొరపాటున తప్పుచేసేందుకు తలవంచితే జీవితాంతం శిక్ష తప్పదంటూ ఉద్యోగులు లోలోన మదనపడుతున్నట్టు తెలిసింది. తమ ఆవేదనను తోటి ఉద్యోగుల వద్ద వ్యక్తంచేస్తుండడం గమనార్హం.
సాధారణంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు ఒకేసారి జరుగుతుంటాయి. ఒక విడతలో 10 నుంచి 12 మంది కమిషనర్లను అటుఇటు మారుస్తుంటారు. కానీ తాము చెప్పిన అడ్డగోలు పనికి ఒప్పుకోనందున కేవలం నల్లనయ్యను తప్పించడం కోసం ప్రభుత్వంలోని పెద్దలు, రాజ్యాంగ పదవులో ఉన్న ఇంకో పెద్ద కలిసి మున్సిపల్ శాఖపై ఒత్తిడి తెచ్చి మరీ ప్రత్యేక జీవో విడుదల చేయించి కమిషనర్‌ను ఇక్కడి నుంచి పంపించేశారని ఆ శాఖలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇదేనా కారణం?
విజయనగరం మున్సిపల్ కమిషనర్ నల్లనయ్యను రాత్రికిరాత్రి బదిలీ చేసేశారు. వాస్తవానికి ఘోరాతి ఘోరమైన తప్పిదం జరిగినప్పుడు.. ఇంకేదైనా శాఖాపరమైన విచారణలో అధికారి అడ్డగోలుతనం బయట పడినప్పుడు మాత్రమే ఒకేఒక్క పేరుతో జీవో విడుదల చేసి ఆయనను అక్కడి నుంచి తప్పిస్తారు. కానీ కేవలం నల్లనయ్య కోసమే జీవో తెచ్చిమరీ ఆయనను బదిలీ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అధికార బలంతో తాము చెప్పినట్టే అన్నీ చేయాలంటూ ఒత్తిడి చేయడం, దానికి ఆయన ససేమిరా అనడం వల్లే బదిలీ వేటు వేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కమిషనర్ అకస్మాత్తు బదిలీ వెనుక ఇదేనా కారణం!
టీడీఆర్ పేరిట రూ.కోట్లు
కొట్టేసేందుకు ఎత్తులు..
కుదరదన్నందుకు కమిషనర్‌ను
బదిలీచేశారంటూ విమర్శలు


