12న అల్యూమ్ని మీట్ అండ్ గ్రీట్
విజయనగరం రూరల్: స్థానిక జేఎన్‌టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో ఈ నెల 12న అల్యూమ్ని మీట్ ఆండ్ గ్రీట్– 2026 కార్యక్రమం నిర్వహించనున్నామని ఉప కులపతి వీవీ సుబ్బారావు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమన్నారు. అల్యూమ్ని కలయిక ద్వారా పూర్వ విద్యార్థులు తమ సహచర విద్యార్థులతో ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలు, వారి అభిప్రాయాలు పంచుకునే అవకాశం కలుగుతుందన్నారు. అనంతరం అల్యూమ్ని కార్యక్రమం నిర్వహణపై అధికారులు, ఆచార్యులు, సిబ్బందితో చర్చించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ జి.జయసుమ, విశ్వవిద్యాలయం డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్, వివిధ విభాగాల అధిపతులు, తదితరులు పాల్గొన్నారు.
చెరువులో పడి వ్యక్తి మృతి
లక్కవరపుకోట: మండలంలోని గేదెలవానిపాలెం పంచాయతీ శివారు వేచలపువానిపాలెం గ్రామానికి చెందిన కిల్లంపల్లి దేముడు (60) ప్రమాదవశాత్తు చెరువులో పడి బుధవారం రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి ఎస్సై సీహెచ్.నవీన్‌పడాల్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దేముడు బహిర్భుమి కోసం సాయంత్రం గ్రామం సమీపంలో గల నారప్ప చెరువు సమీపంలోకి వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడిపోయాడు. ఈత రాకపోవడంతో మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి కుమారుడు అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
విద్యుత్‌షాక్‌తో గీత కార్మికుడి మృతి
శృంగవరపుకోట: మండలంలోని పెదఖండేపల్లి గ్రామం సమీపంలో విద్యుత్ షాక్ తగిలి కల్లుగీత కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రాజీపేట గ్రామానికి చెందిన రాడి రాము (60) భార్యతో కలిసి వెళ్లి, కొబ్బరితోటలో చెట్టు ఎక్కి కొబ్బరికాయలు తీస్తున్న సమయంలో ఉదయం 10.30గంటల సమయంలో చెట్టు పక్కగా ఉన్న 11కేవీ విద్యుత్ వైర్లను గమనించలేదు. కొబ్బరి చెట్టు ఎక్కుతున్న సమయంలో 11కేవీ కేబుల్ రాము వీపుమీద తగిలింది. దీంతో తీవ్రమైన విద్యుత్ షాక్‌కు గురై కాళ్లు, చేతులు, వీపు తీవ్రంగా కాలిపోయి పడిపోయి ప్రాణాలు వదిలాడు. అంతా కళ్లముందే నిమిషాల వ్యవధిలో జరిగిపోవడంతో ఖిన్నురాలైన మృతుని భార్య కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు ఘటనాస్థలికి వచ్చి పోలీసులకు, ఫోన్ చేయగా పోస్టుమార్టం కోసం ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. విద్యుతత్‌్ శాఖ నిర్లక్ష్యం నిండు ప్రాణాలు తీసిందని మృతుని కుటుంబీకులు వాపోతున్నారు.
● పోలీసులకు అప్పగింత
బొబ్బిలి: మండలంలోని కాశిందొర వలస, డొంగురువలస గ్రామాల మధ్య చెరువులు, ఖాళీ ప్రదేశాల్లో భారీగా కంకర డంప్ చేస్తున్న ఐదు లారీలను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, మైన్స్ అధికారులు గురువారం సీజ్ చేశారు. విజిలెన్స్ అధికారులకు సమాచారమందడంతో వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. అక్కడ పొక్లెయిన్, ఇతర వాహనాలతో భారీగా డంపింగ్ జరుగుతోంది. అక్కడున్న 5లారీలను మట్టితో సహా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వాటికి భారీ జరిమానా విధించారు. జరిమానా చెల్లించే వరకూ పోలీసు కస్టడీకి తరలించారు. ఈ విషయమై సీఐ కె.సతీష్ కుమార్‌ను వివరణ కోరగా వాహనాలకు జరిమానా చెల్లించిన తరువాత తమకు సమాచారమందిస్తారని అప్పుడు వాటిని విడిచిపెడతామన్నారు. అప్పటివరకూ తామే కస్టోడియన్స్‌గా వ్యవహరిస్తామన్నారు.
పెట్రేగిపోతున్న అక్రమార్కులు
బొబ్బిలి పరిసరప్రాంతాల్లో ఇసుక, మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఈ తంతు భారీ స్థాయిలో జరుగుతోంది. గురువారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, గనుల అధికారులకు ఫిర్యాదులు వెళ్లగా వెళ్లి పట్టుకున్నారు. మరో చోట కూడా పెద్ద ఎత్తున పొక్లెయిన్, టిప్పర్లతో తవ్వకాలు, రవాణా సాగినప్పటికీ అక్రమార్కులు కూటమి నాయకులతో మేనేజ్ చేయించుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో టిప్పర్లు, పొక్లెయిన్ కేసులో తప్పించుకుని కేవలం 5లారీలు మాత్రమే తెరమీదకు వచ్చినట్లు తెలిసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
12న అల్యూమ్ని మీట్ అండ్ గ్రీట్
12న అల్యూమ్ని మీట్ అండ్ గ్రీట్


