మా పిల్లలను పాఠశాలకు పంపించం..
● శివరాం గ్రామస్తులు
చీపురుపల్లి రూరల్ (గరివిడి): మద్యం మత్తులో పాఠశాలకు వస్తున్న ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని.. అతడు ఉన్నంత వరకు తమ పిల్లలను పాఠశాలకు పంపించమని శివరాం గ్రామస్తులు స్పష్టం చేశారు. ఈమేరకు స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి గురువారం ఓ లేఖ అందజేశారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఎ.చక్రపాణి రోజూ పాఠశాలకు మద్యం మత్తులో వస్తుండడాన్ని గుర్తించి గతేడాది నవంబర్ 3న గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశామన్నారు. అయినప్పటికీ అతడి తీరు మారకపోవడంతో డిసెంబర్ 30న ఎంఈఓకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో ఎంఈఓ ఈ విషయాన్ని డీఈఓకు తెలియజేశారని, కాని ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఉపాధ్యాయుడు ఉన్నంత వరకు తమ పిల్లలను పాఠశాలకు పంపించమని స్పష్టం చేశారు.


