సబ్‌జైల్ తనిఖీ
విజయనగరం లీగల్: ఖైదీల పట్ల విపక్ష చూపిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఎ. కృష్ణప్రసాద్ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన పట్టణంలోని సబ్ జైలును సందర్శించారు. మొదటగా కారాగారంలో ఉన్న ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నేర ప్రవృత్తిని విడనాడాలని మంచి పౌరులుగా మెలగాలని హితవు పలికారు. సకాలంలో న్యాయసహాయం అందించడానికి జైల్ లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను ఏర్పాటు చేశామని ఖైదీల పట్ల సిబ్బంది గాని, తోటి ఖైదీలు గాని వివక్ష చూపించరాదన్నారు. సబ్ జైల్‌లో కొనసాగుతున్న జైల్ లీగల్ ఎయిడ్ క్లినిక్ లను తనిఖీ చేసి వాటిని సక్రమంగా కొనసాగించాలని సూచించారు. జైల్లో ఉన్న ముద్దాయిలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ముఖ్య కర్తవ్యమన్నారు. వంటగదిని భోజనశాలను పరిశీలించారు. అనంతరం స్టోర్ రూమ్ సందర్శించి వంట సరుకులను పప్పు దినుసులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ అకస్మిక తనిఖీలో భాగంగా సబ్ జైల్ సూపరింటెండెంట్ పాల్గొన్నారు.


