మెరుగైన కంటి చూపుతో ప్రమాదాలు దూరం
● రవాణా శాఖ ఉప కమిషనర్ మణికుమార్
విజయనగరం టౌన్: కంటిచూపు సక్రమంగా ఉంటే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని రవాణా శాఖ ఉప కమిషనర్ డి.మణికుమార్ తెలిపారు. జాతీయ రహదారి మాసోత్సవాల సందర్భంగా నగరంలోని రవాణా శాఖ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన నేత్ర వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. వాహనాలు నడిపే సమయంలో స్పష్టమైన దృష్టి ఎంతో కీలకమని, కంటిచూపులో లోపాల కారణంగా కొన్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. అందువలన వాహనచోదకులు అప్రమత్తంగా ఉండి, క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. నేత్ర వైద్య శిబిరంలో సుమారు 150 మంది డ్రైవర్లు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. రవాణా శాఖ ఇన్‌స్పెక్టర్లు ఎం.మురళీకృష్ణ, యు.దుర్గాప్రసాద్, వి.వెంకటరావు, ఎం.శ్రావ్య, నవీన్‌కుమార్ పాల్గొన్నారు.


