చిన్నారులకు అందని బాలామృతం
విజయనగరం ఫోర్ట్: అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకుల సరఫరాలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ప్రతినెలా ఒకటో తేదీనే సరఫరా చేయాల్సిన బాలామృతం ప్యాకెట్లు 7వ తేదీ వచ్చినా అందకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. చిన్నారులకు పౌష్టికాహారం అందజేయడంలో ప్రభుత్వ నిర్లిప్తతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా అయితే, చిన్నారుల ఎదుగుదల ఎలా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇదీ పరిస్థితి...
జిల్లాలో 2,499 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 292 మినీ, 2,207 మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాలు. వీటి పరిధిలో 74,432 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో తల్లులు 7,501 మంది, గర్భిణులు 6,991 మంది, 0–6 నెలలు లోపు పిల్లలు 6,992 మంది, 6 నెలలు నుంచి 3 ఏళ్లలోపు పిల్లలు 34,225 మంది, 3 నుంచి ఐదేళ్ల లోపు పిల్లలు 18,723 మంది ఉన్నారు. వీరిలో 34,225 మంది పిల్లలకు నెలకు సరిపడా ఒక్కక్కొరికి రెండున్నర కేజీలు చొప్పున బాలామృతం అందించాలి. ఈ నెల 7వ తేదీ వచ్చినా ఇంతవరకు అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా కాకపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఇదే విషయాన్ని ఐసీడీఎస్ పీడీ టి.విమలారాణి వద్ద ప్రస్తావించగా బాలామృతం ప్యాకెట్స్ ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాలకు చేరాల్సి ఉందని, ఎందుకు చేరలేదో విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
7వ తేదీ గడిచినా అంగన్‌వాడీ కేంద్రాలకు చేరని సరుకులు
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు: 2,499
బాలామృతం అందుకునే లబ్ధిదారులు: 34,225 మంది
చిన్నారులకు అందని బాలామృతం


