భోగాపురం విమానాశ్రయం క్రెడిట్‌ వైఎస్సార్‌సీపీదే.. | - | Sakshi
Sakshi News home page

భోగాపురం విమానాశ్రయం క్రెడిట్‌ వైఎస్సార్‌సీపీదే..

Jan 7 2026 7:16 AM | Updated on Jan 7 2026 7:16 AM

భోగాపురం విమానాశ్రయం క్రెడిట్‌ వైఎస్సార్‌సీపీదే..

భోగాపురం విమానాశ్రయం క్రెడిట్‌ వైఎస్సార్‌సీపీదే..

విజయనగరం రూరల్‌:

భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి కృషి చేసినది నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిదని, 100 శాతం క్రెడిట్‌ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని వైఎస్సార్‌ సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్‌, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ధర్మపురిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 4న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి అంతర్జాతీయ వాణిజ్యవ్యాలిడేషన్‌ విమానం ల్యాండ్‌ కావడం ఆనందంగా ఉందన్నారు. ఎప్పుడూ వెనుకబడిన ప్రాంతమని చెప్పుకునే ఉత్తరాంధ్రకు నేడు ప్రపంచపటంలో ఓ స్థానం దొరికిందన్నారు. భోగాపురంలో రూ.4,500 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి కృషి చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, నిర్మాణ బాధ్యతలు చేపట్టిన జీఎంఆర్‌ సంస్థకు, నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఈ ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

విమానాశ్రయ నిర్మాణానికి ఎయిర్‌పోర్ట్‌ అథారిటీకి కౌలువాడ, సవరవిల్లి, కంచేరు, రావాడ, గూడెపువలస, ఎ.రావివలస రెవెన్యూ గ్రామాల్లో 2756.15 ఎకరాల భూ బదలాయింపు జరిగింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్‌, తాగునీరు, ఫెన్సింగ్‌ నిర్మాణం, భూ బదలాయింపు జరిగిన భూముల్లో 5 గ్రామాల ప్రజలకు పునరావాసం, ఇతరత్రా పనులకు అప్పటి ప్రభుత్వం రూ. 900 కోట్లు మంజూరు చేసిందని జెడ్పీ చైర్మన్‌ తెలిపారు. భూసేకరణ, న్యాయచిక్కులు తదితర అన్ని అడ్డంకులు తొలగి, ప్రభుత్వ నిబంధనలు అనుసరించి విమానాశ్రయ నిర్మాణానికి 2023 మే 3న అప్పటి సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారన్నారు. 2024 ఎన్నికల ముందే విమానాశ్రయం పనులు సుమారు 40 శాతం పూర్తయ్యాయని, జీఎంఆర్‌ సంస్థతో ఒప్పందాలు, నిర్మాణ పనుల ప్రగతి అంతా ఆ సంస్థ వెబ్‌సైట్‌ తెరిస్తే తెలుస్తుందన్నారు.

● చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు ఎన్నికల ముందు హడావిడిగా శంకుస్థాపనలు చేసి ప్రజలను మభ్యపెట్టడంలో ఆరితేరిపోయారని, ఇదంతా రాష్ట్ర ప్రజలకు ఎరుకేనని అన్నారు. రైతులకు యూరియా ఇవ్వలేని నాయకులు విమానాశ్రయం నిర్మించారంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. నాటి జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి శంకుస్థాపనలో ఉన్నానని అంటున్నారని, ఒక్కసారైనా దీనిపై సమీక్ష నిర్వహించారా అని ప్రశ్నించారు.

● జీఎంఆర్‌ సంస్థ అన్ని అనుమతులు పొంది విమానాశ్రయం నిర్మాణం పనులు వేగవంతం చేస్తే, విమానాశ్రయానికి అన్ని ప్రాంతాల అనుసంధానానికి వీలుగా చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేసింది శూన్యమన్నారు. కేవలం విశాఖ నుంచి 7 రోడ్లు కనెక్టివిటీ అని చెబుతున్నా ఇప్పటివరకు 10 శాతం పనులు పూర్తి కాలేదని జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసరావు ఆరోపించారు. వేరొకరి పథకాలకు పేరుమార్చి కొనసాగించడం, వేరొకరి చేపట్టిన అభివృద్ధిని తమ గొప్పగా చెప్పుకోవడం టీడీపీ నాయకుల నైజమని విమర్శించారు. ముందుగా ప్రజా సంక్షేమం, పాలనపై దృష్టి సారించాలని, విమానాశ్రయం అభివృద్ధికి అవసరమైన పనులను మంజూరు చేసి, వాటిపై దృష్టి సారించాలని హితవు పలికారు. కేంద్ర మంత్రి బీచ్‌ కారిడార్‌ అభివృద్ధికి 6 వేల కోట్లు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దానిని పట్టించుకోవడం లేదన్నారు. చంద్రబాబుకు, ఆ పార్టీ నేతలకు ఫొటోలకు ఫోజులు, ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజాసంక్షేమంపై దృషి లేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడుబాబు, జిల్లా ప్రధాన ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి, జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు జైహింద్‌కుమార్‌, పార్టీ మండలాధ్యక్షుడు ఉప్పాడ సూర్యనారాయణ, పతివాడ అప్పలనాయుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

అప్పుడే మౌలిక సదుపాయాల కల్పన

పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనే తలంపుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. భోగాపురంలో విమానాశ్రయం నిర్మాణానికి బీజం పడింది 2020 జూన్‌ 12న అని, దీనికి సంబంధించి జీఎంఆర్‌ సంస్థ రాష్ట్ర ఏపీఏడీసీతో నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఒప్పందం చేసుకుని, ఎల్‌వోఏ తీసుకున్నారని తెలిపారు. జీఎంఆర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్‌ పేరుతో స్పెషల్‌ పర్సస్‌ కింద నిర్మాణానికి ముందుకు వచ్చారని తెలిపారు.

విమానాశ్రయం నిర్మాణానికి 100 శాతం కృషి చేసింది మాజీ సీఎం

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

అన్ని అనుమతులు పూర్యయ్యాక 2023లో శంకుస్థాపన

మౌలిక వసతుల కల్పనకు వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.900 కోట్లకు పైగా ఖర్చు

జీఎంఆర్‌ సంస్థ వెబ్‌సైట్‌లో అన్ని వివరాలు ఉంటాయి

18 నెలల కాలంలో చంద్రబాబు సర్కారు చేసింది శూన్యం

రైతులకు యూరియా ఇవ్వలేరు..

విమానాశ్రయం నిర్మాణమా?

ఎవరో చేసిన అభివృద్ధిని తానే చేశానని చెప్పుకోవడం సిగ్గుచేటు

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్‌, భీమిలి నియోజకవర్గ

సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement