టార్పాలిన్లు ఎక్కడ?
విజయనగరం ఫోర్ట్:
జిల్లాలోని అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తుఫాన్ సమయంలో పంట తడిసిపోకుండా రైతులకు గతేడాది ఇచ్చిన అరకొర టార్పాలిన్లు కూడా తిరిగిరాకపోవడంతో వ్యవసాయ సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. రైతుల నుంచి సేకరించిన టార్పాలిన్లను టీడీపీ నాయకులు ఉంచుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విషయం తెలిసినా అధికారులు అడగలేకపోతున్నారంటూ ఆ శాఖలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అవసరం తీరాక రైతులు తిరిగి అప్పగించినా.. నాయకులు ఉంచుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది తుఫాన్ సమయంలో రైతులకు సుమారు వెయ్యి టార్పాలిన్లు అందజేయగా తిరిగి వ్యవసాయ శాఖ అధికారుల వద్దకు పదుల సంఖ్యలో మాత్రమే చేరాయి. ఇప్పుడు ఈ టార్పాలిన్లపై ఉన్నతాధికారులు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతామని సిబ్బంది మదనపడుతున్నారు. కొందరు మాత్రం అధికార పార్టీ నాయకులే టార్పాలిన్లు ఉంచుకున్నారన్న విషయాన్ని చెప్పేద్దామని చెబుతుంటే.. మరికొందరు వారి నోరునొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశాన్ని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వి.తారకరామారావు వద్ద ప్రస్తావించగా వెయ్యి టార్పాలిన్లను మండల వ్యవసాయశాఖ అధికారులకు అందించామని, తిరిగి ఎన్ని వచ్చాయన్నది వారికే తెలుస్తుందన్నారు. ఈ ఏడాది టార్పాలిన్‌ల సరఫరాను ఏఎంసీకి అప్పగించారని తెలిపారు.
గంట్యాడ మండలంలో గతేడాది 42 టార్పాలిన్‌లు వ్యవసాయశాఖ కార్యాలయం నుంచి తుఫాన్ సమయంలో రైతులకు అందించారు. వీటిలో 20 మాత్రమే వెనుకకు వచ్చాయి. మిగిలిన 22 ఎక్కడ ఉన్నాయో వ్యవసాయ సిబ్బందికి తెలియని పరిస్థితి.
విజయనగరం మండలంలో 8 టార్పాలిన్లు అందజేయగా ఒక్కటీ వెనుకకు రాలేదు.


