పాపం.. పసిబిడ్డ..!
● చెత్త కుండీపక్కన శిశువు మృతదేహం లభ్యం
జామి: పాపం.. ఏ కన్నతల్లి బిడ్డో.. తల్లిపేగు తెగనేలేదు.. కళ్లు తెరవక ముందే మృతశిశువుగా మారింది. తల్లిప్రేమకు దూరమై చెత్తకుప్పల్లో దర్శనమిచ్చింది. ఈ హృదయవిదారక చిత్రం జామి మండలం ఎం.కె.వలస గ్రామంలో మంగళవారం కనిపించింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కొటాన పార్వతి ఆవులు కట్టేందుకు వెళ్తూ చెత్తకుండీ పక్కనే ఉన్న మగ శిశువు మృతదేహాన్ని గుర్తించి గ్రామస్తులకు తెలియజేసింది. వారు పోలీసులకు, వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ వీరజనార్దన్, అలమండ పీహెచ్‌సీ వైద్యాధికారి వినీ త, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రామయ్యమ్మ ఘటనా స్థలానికి చేరుకుని శిశువు మృతదేహాన్ని పరిశీలించారు. విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మంగళవారం తెల్లవారుజామున శిశువు మృతదేహాన్ని పడేసి ఉంటారని వైద్యాధికారి తెలిపారు. అప్పుడే పుట్టిన బిడ్డ మృతిచెందితే ఖననం చేయా ల్సింది పోయి ఇలా చెత్తకుండీలో పడేయడాన్ని స్థానికులు తప్పుబడుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.
పాపం.. పసిబిడ్డ..!


