సింథియా : విశాఖపట్నంలోని తూర్పు నావికాదళ కేంద్రం వేదికగా నిర్వహిస్తున్న ఎనిమిదో విడత భారత్–మయన్మార్ ద్వైపాక్షిక నావికాదళ విన్యాసం ఇమ్నెక్స్–26లో హార్బర్ దశ విజయవంతంగా ముగిసింది. నవంబర్ 10న ప్రారంభమైన ఈ విన్యాసాల్లో పాల్గొనేందుకు మయన్మార్ నావికాదళానికి చెందిన యుద్ధనౌక యూఎంఎస్ కింగ్‌సిన్ ఫ్యూషిన్ విశాఖకు చేరుకుంది. భారత నావికాదళం తరఫున గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్‌ఎస్ రాణా, ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసెల్ ఐఎన్‌ఎస్ సుమేధ పాల్గొంటున్నాయి. హార్బర్ దశలో భాగంగా ఇరుదేశాల నావికాదళ నిపుణుల మధ్య సాంకేతిక అంశాలపై చర్చలు, పరస్పర నౌకల సందర్శన, ఉన్నతాధికారుల సమావేశాలు నిర్వహించారు. అలాగే, స్నేహపూర్వక క్రీడా పోటీలు నిర్వహించి సుహృద్భావ వాతావరణాన్ని పెంపొందించారు. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాసాగర్ దార్శనికత, నైబర్‌హుడ్ ఫస్ట్ విధానాలకు అనుగుణంగా ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నారు. బంగాళాఖాతం, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో సముద్ర భద్రతను బలోపేతం చేయడం, ఇరుదేశాల నావికాదళాల మధ్య కార్యకలాపాల సమన్వయాన్ని మెరుగుపరచడం ఈ విన్యాసాల ప్రధాన ఉద్దేశం. హార్బర్ దశ ముగియడంతో తదుపరి సముద్ర దశ (సీ ఫేజ్)లో ఇరుదేశాల యుద్ధనౌకలు సంయుక్తంగా సముద్ర విన్యాసాలు, వ్యూహాత్మక కసరత్తులు నిర్వహించనున్నాయని తూర్పు నావికాదళం వెల్లడించింది.
సముద్ర భద్రత,
పరస్పర సహకార బలోపేతమే లక్ష్యం


