డాబాగార్డెన్స్: జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవిని యాదవ సామాజిక వర్గానికి కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం అధ్యక్షుడు కుర్రా శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో యాదవులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని, యాదవ సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. నగరంలోని బీచ్‌రోడ్డు శ్రీకృష్ణుడి ఆలయం సమీపాన సోమవారం పలువురు యాదవ సంఘాల నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాల్లో యాదవుల ఓట్లు కీలకపాత్ర పోషిస్తున్నప్పటికీ రాజకీయ పదవులు, అవకాశాల కల్పనలో తగిన ప్రాధాన్యం లభించడం లేదన్నారు. యాదవ సామాజిక వర్గ అభివృద్ధికి ఏర్పాటు చేసిన యాదవ కార్పొరేషన్‌కు రూ.6 వేల కోట్ల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవి యాదవులకు కేటాయించకపోతే 2029 ఎన్నికల్లో యాదవ సామాజిక వర్గం నుంచి తీవ్ర అసంతృప్తి ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు. యాదవులంతా ఐక్యంగా ఉంటూ రాజకీయంగా తమ హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు.
పార్టీలకతీతంగా
యదుమేళా
ఈ నెల 24న నిర్వహించనున్న యదుమేళ ఉత్సవాన్ని యాదవులంతా పార్టీలకతీతంగా ఐకమత్యంతో ఘనంగా నిర్వహించాలని శ్రీనివాసరావు కోరారు. సామాజిక ఐక్యత బలోపేతం చేస్తూ, యాదవుల సంస్కృతి, సాంప్రదాయాలు భావితరాలకు అందించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జాతీయ యాదవ ఐక్యవేదిక అధ్యక్షుడు అలిసి అప్పలనారాయణ, కార్యదర్శి నక్కా సాంబశివరావు, ఇసరపు పైడిరాజు, వియ్యపు లక్ష్మీనాయుడు తదితరులు పాల్గొన్నారు.


