అక్వన్‌ అలజడి | - | Sakshi
Sakshi News home page

అక్వన్‌ అలజడి

Nov 17 2026 12:50 AM | Updated on Nov 17 2026 12:50 AM

గంగపుత్రుల గుండెల్లో మూడో తుపాను గుబులు 19 నుంచి రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన మారుతున్న తుపాను గమనంతో పెరుగుతున్న ఉత్కంఠ బోట్లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న మత్స్యకారులు

బోట్లు కాపాడుకునేందుకు

పెదజాలారిపేట వద్ద

మత్స్యకారుల ఆరాటం

సాక్షి, విశాఖపట్నం : వరుస తుపాన్లు గంగపుత్రుల బతుకులను ఛిద్రం చేస్తున్నాయి. గత తుపాన్ల నష్టాల నుంచి కోలుకోకముందే ‘అక్వన్‌’ రూపంలో మరో ముప్పు ముంచుకొస్తోంది. ఇప్పటికే బోట్లు, వలలు కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన మత్స్యకారులను తాజా హెచ్చరిక కలవరపెడుతోంది. ఎక్కడ తీరం దాటుతుందో తెలియని తుపాను గమనంతో తీరప్రాంతంలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు తమ జీవనాధారమైన బోట్లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

మారుతున్న గమనం.. పెరుగుతున్న ముప్పు

అక్వన్‌ తుపాను గమనం ఎప్పటికప్పుడు మారుతుండటంతో తీరం దాటే ప్రాంతంపై స్పష్టత కొరవడింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తీరం దాటే సమయంలో గంటకు 90–110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదముంది. ఈ నెల 19 నుంచి రెండు రోజుల పాటు విశాఖలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు.

తీరంలో అలజడి.. వేటకు విరామం

విశాఖ సముద్ర తీరంలో అలల ఉధృతి పెరుగుతుండటంతో తుపాను ప్రభావంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సముద్రం క్రమంగా అల్లకల్లోలంగా మారుతుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సముద్రంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

పచ్చదనానికీ పొంచి ఉన్న ప్రమాదం

గత తుపాను ప్రభావంతో నగరంలో వెయ్యికి పైగా భారీ వృక్షాలు నేలకూలాయి. ఇప్పుడు మళ్లీ ప్రచండ గాలులు వీస్తే మిగిలిన చెట్లకూ ముప్పు తప్పదన్న భయం వెంటాడుతోంది. తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు విపత్తు నిర్వహణ బృందాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని, బలహీనమైన వృక్షాలు, ప్రమాదకర ప్రాంతాలపై ముందస్తు చర్యలు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు.

బోట్లను కాపాడుకునేందుకు తంటాలు

గత తుపాన్లలో లంగరు వేసిన బోట్లు సైతం మునిగిపోవడంతో మత్స్యకారులు లక్షలాది రూపాయల నష్టాన్ని చవిచూశారు. ఆ నష్టాల నుంచి కోలుకోకముందే మరో ముప్పు ఎదురుకావడంతో బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వం నుంచి ఆశించిన సాయం అందకపోవడంతో తమ బోట్లను తామే కాపాడుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రొక్లెయిన్ల సాయంతో వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బోట్లే జీవనాధారంగా బతికే గంగపుత్రుల ఆరాటం కలచివేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement