మూఢనమ్మకాలు వీడి.. వైద్యాన్ని ఆశ్రయించాలి కేజీహెచ్‌లో నెలకు సగటున 180 మందికి ఈఈజీ పరీక్షలు ఏడాదిలో 5,244 మంది ఔట్‌పేషెంట్లకు వైద్య సేవలు నేడు జాతీయ మూర్చ వ్యాధి అవగాహన దినం
మహారాణిపేట: మూర్ఛ.. ఈ పేరు వినగానే చాలామందిలో భయం మొదలవుతుంది. మూర్ఛ వస్తే దెయ్యం పట్టిందని, చేతబడి జరిగిందని భావించే వారు ఇప్పటికీ ఉన్నారు. మరికొందరు వైద్య చికిత్సకు బదులుగా మూఢనమ్మకాల వెంటపడి విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. వాస్తవానికి మూర్ఛ.. మెదడులోని నాడీకణాల విద్యుత్ కార్యకలాపాల్లో తాత్కాలిక అసాధారణ మార్పుల వల్ల వచ్చే నాడీ సంబంధిత వ్యాధి మాత్రమే. ఇది అంటువ్యాధి కాదు.. మానసిక బలహీనతకు సంకేతమూ కాదు. సరైన వైద్య పరీక్షలు, క్రమబద్ధమైన చికిత్సతో వ్యాధిని నియంత్రించుకోవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నేడు(నవంబర్ 17) జాతీయ మూర్ఛ వ్యాధి అవగాహన దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ప్రత్యేక కథనం.
ఒక్కొక్కరిలో ఒక్కోలా లక్షణాలు
మూర్ఛ వచ్చినప్పుడు కొందరిలో అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం, కిందపడిపోవడం, చేతులు, కాళ్లు కొట్టుకోవడం, శరీరం బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరిలో కొద్దిసేపు శూన్యంలోకి చూస్తూ ఉండిపోవడం, ఎదుటివారు పిలిచినా స్పందించకపోవడం, అయోమయానికి గురికావడం వంటి లక్షణాలు ఉంటాయి. ప్రతి బాధితుడిలోనూ ఒకే రకమైన లక్షణాలు కనిపించవని వైద్యులు చెబుతున్నారు.
కేజీహెచ్‌లో నెలకు 180 మందికి
ఈఈజీ పరీక్షలు
మూర్ఛ వ్యాధి నిర్ధారణలో వైద్య పరీక్షలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కేజీహెచ్‌లో గత ఏడాది కాలంలో మూర్ఛ లక్షణాలతో 5,244 మంది ఔట్‌పేషెంట్(ఓపీ) విభాగాన్ని సందర్శించారు. వీరిలో 2,104 మందికి ఈఈజీ (ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్) పరీక్షలు నిర్వహించారు. ప్రతినెలా సగటున 180 మందికి ఈ పరీక్షలు చేస్తున్నారు. మెదడులోని విద్యుత్ కార్యకలాపాలను నమోదు చేసేందుకు ఈఈజీ పరీక్ష ఉపయోగపడుతుంది. వ్యాధి తీవ్రత, రోగుల ఆరోగ్య పరిస్థితిని బట్టి గత ఏడాది కాలంలో 289 మందికి ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. ప్రతినెలా సుమారు 20 నుంచి 30 మంది మూర్ఛ బాధితులకు ఇన్‌పేషెంట్ సేవలు అందిస్తున్నారు.
ఐదు నిమిషాలు దాటితే..
మూర్ఛ దాడి ఐదు నిమిషాలకు మించి కొనసాగినా, ఒకసారి పూర్తిగా కోలుకోకముందే మరోసారి దాడి వచ్చినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనా వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలి. మొదటిసారి మూర్ఛ వచ్చినా తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. మూఢనమ్మకాలను నమ్మి చికిత్స ఆలస్యం చేయకుండా, సకాలంలో వైద్య సేవలు పొందితే మూర్ఛను సమర్థంగా నియంత్రించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మూర్ఛ వచ్చినప్పుడు ఏం చేయాలి?
మూర్ఛ వచ్చినప్పుడు బాధితుల్ని చూసి భయపడకుండా ప్రశాంతంగా వ్యవహరించాలి. గాయాలు కాకుండా ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
తలకు గాయం కాకుండా మెత్తటి వస్తువును ఉంచాలి.
చుట్టుపక్కల ఉన్న గట్టి, పదునైన వస్తువులను తొలగించాలి.
సాధ్యమైనంత త్వరగా బాధితులను పక్కకు తిప్పి ఉంచాలి.
మూర్ఛ ఎంతసేపు కొనసాగుతుందో గమనించాలి.
నోట్లో చెంచాలు, గుడ్డలు, వేళ్లు తదితర వస్తువులు పెట్టకూడదు.
చేతులు, కాళ్ల కదలికలను బలవంతంగా ఆపేందుకు ప్రయత్నించకూడదు.
పూర్తిగా స్పృహలోకి వచ్చే వరకు నీళ్లు, ఆహారం ఇవ్వకూడదు.
మందులతో నియంత్రణ సాధ్యమే
మూర్ఛ వ్యాధిపై సమాజంలో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉంది. దీనిని మూఢనమ్మకాలతో ముడిపెట్టడం సరికాదు. రోగి పరిస్థితిని బట్టి న్యూరాలజిస్టులు అవసరమైన పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స అందిస్తారు. మూర్ఛ వ్యాధికి సమర్థవంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. కొంతకాలం మూర్ఛ రాలేదని రోగులు తమంతట తాముగా మందులు నిలిపివేయకూడదు.
– డాక్టర్ ఎస్.గోపి, న్యూరాలజీ విభాగాధిపతి, కేజీహెచ్/ఏఎంసీ


