● సదస్సులు.. ప్రచారార్భాటాలు..
ఒకవైపు ఆకాశాన్ని తాకేలా పెట్టుబడుల ప్రచారాల హోరు.. మరోవైపు అప్పుల ఊబిలో కూరుకుపోయి అడుగంటిన జిల్లా ఖజానా బేజారు.. విశాఖ వేదికగా రెండు రోజుల పాటు ‘భాగస్వామ్య సదస్సు’పేరుతో సాగిన వీఐపీల హడావుడి జిల్లాకు మిగిల్చింది రిక్త హస్తాలు.. అప్పుల తిప్పలే. వాస్తవ రూపం దాల్చిన పెట్టుబడులు లేకపోగా, కేవలం పబ్లిసిటీ కోసం రూ.వందల కోట్లు తగలేసిన చంద్రబాబు సర్కారు.. స్థానిక సంస్థల జేబులు
గుల్ల చేసి మరోసారి చేతులు దులిపేసి
వెళ్లిపోయింది.
సాక్షి, విశాఖపట్నం: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖను ‘ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్’గా ప్రకటించి రోడ్ల విస్తరణ, జంక్షన్ల సుందరీకరణ, సచివాలయాలు, హెల్త్‌క్లినిక్‌లు, బీచ్ ఐటీ కాన్సెప్ట్‌తో నగరాన్ని అభివృద్ధి బాట పట్టిస్తే.. నేటి చంద్రబాబు ప్రభుత్వం నగరాన్ని కేవలం సదస్సుల కోసం ‘ఫంక్షన్‌హాల్’, రీల్స్ షూటింగ్ స్పాట్స్‌గా మార్చేసింది. ప్రాంతీయ సదస్సులు.. భాగస్వామ్య సదస్సులంటూ అలంకరణలు, ఫైవ్‌స్టార్ హోటళ్ల బసలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోంది.
సదస్సు పేరంటేనే ఉలికిపాటు!
చంద్రబాబు ప్రభుత్వం సదస్సు నిర్వహిస్తామని ఆలోచిస్తే చాలు.. జిల్లా అధికారులు ఉలిక్కిపడుతున్నారు. ఎక్కడ సమ్మిట్ వేదిక విశాఖ అని ప్రకటిస్తారోనంటూ.. ఖజానాలో ఉన్న రూపాయి రూపాయి లెక్కేసుకుంటూ ఆపసోపాలు పడుతున్నారు. ఇటీవల ఐఐఎం విశాఖపట్నంలో రీజనల్ సమ్మిట్ పేరుతో నిర్వహించిన 8 గంటల సదస్సుకే ఏకంగా రూ.రూ.2 కోట్లు ఖర్చు చేయడం ప్రభుత్వ ఆర్భాటానికి అద్దం పడుతోంది. జిల్లా ఖజానా నుంచి ఇప్పటికే రూ.250 కోట్లు వరకూ కేవలం ఈ సదస్సుల హడావుడికే ఆవిరైపోయాయి.
ప్రజల సొమ్ము.. పబ్లిసిటీ పాలు!
ప్రజలు ఆస్తి, నీటి, ట్రేడ్ పన్నుల రూపంలో చెల్లించిన ఆస్తి, నీటి పన్నుల నిధులను డ్రైనేజీలు, రోడ్లపై గుంతలు పూడ్చడానికి కాకుండా ఇలా ఈవెంట్ల కోసం మళ్లించడంతో ఆయా సంస్థల ఆర్థిక పునాదులు కదులుతున్నాయి. వచ్చేది రూ.100.. పోయేది రూ.200 అన్నట్లుగా తయారైంది ప్రభుత్వ వ్యవహారం. విశాఖ అభివృద్ధికి అర్ధ రూపాయి కూడా విదిల్చని సర్కారు, తమ ప్రచార పటాటోపానికి మాత్రం రూ.వందల కోట్లు తగలేసి ఖజానాను ఖాళీ చేసింది. ఇప్పటికే గత కార్యక్రమాలకు సంబంధించి సుమారు రూ.150 కోట్ల బకాయిలు ఉండగా, తాజాగా నిర్వహించిన సమ్మిట్‌తో ఆ భారం ఏకంగా రూ.200 కోట్లు నుంచి రూ.250 కోట్లకు చేరింది. ఖజానాలో చిల్లిగవ్వ లేకపోవడం, జీతాలు, బిల్లులు చెల్లించలేని పరిస్థితుల్లో తీవ్ర డైలమాలో పడిన రెవెన్యూ, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ అధికారులు.. చేసేది లేక బకాయిల జాబితాను ప్రభుత్వానికి పంపేందుకు లేఖలు సిద్ధం చేస్తున్నారు.
భాగస్వామ్య సదస్సు పేరుతో
రెండు రోజుల హడావుడి
ప్రచారార్భాటానికి రూ.200 కోట్లు
తగలేసిన ప్రభుత్వం
ఖజానాలో పైసా లేక డైలమాలో
రెవెన్యూ, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ
ఇప్పటికే గత కార్యక్రమాలకు
రూ.150 కోట్లు బకాయి
బకాయిల జాబితా ప్రభుత్వానికి
పంపేందుకు లేఖలు సిద్ధం చేస్తున్న
అధికారులు
అప్పుల తిప్పలు
యోగా ఉత్సవం కోసం పేరిట చేసిన హడావుడితో జీవీఎంసీ రూ.10 కోట్లు, వీఎంఆర్డీఏ రూ.12 కోట్లు అప్పుల పాలయ్యాయి. ఇక గతేడాది నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు కోసం ఏకంగా రూ.77 కోట్ల భారం వేశారు. ఇందులో ప్రోటోకాల్ కోసం రెవెన్యూ శాఖ రూ.7 కోట్లు, సుందరీకరణ కోసం జీవీఎంసీ రూ.60 కోట్లు, వీఎంఆర్డీఏ రూ.10 కోట్లు భరించాల్సి వచ్చింది. ఈ డబ్బుల్లో సగం కూడా ఇంకా తిరిగివ్వకుండానే.. ఇప్పుడు మరో ఈవెంట్ నిర్వహించి.. ఆర్థికంగా జిల్లా యత్రాంగాలు మరింత దిగజారేలా ప్రభుత్వం చేసిందని ఆయా విభాగాల అధికారులు వాపోతున్నారు.


