మూడు నెలలుగా సరిగ్గా జరగని బీటెక్ క్లాస్‌లు
సిలబస్ పూర్తికాకుండానే
రెండో మిడ్ పరీక్షలు
ఎన్నికలు, సదస్సులతోనే
సగం కాలం వృథా
ఏయూ తీరుపై విద్యార్థులు,
తల్లిదండ్రుల ఆందోళన
విశాఖ విద్య: ఆంధ్రా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్యార్థుల పరిస్థితి త్రిశంకు స్వర్గంలో పడిపోయింది. తరగతులు జరగక ఒకవైపు.. అధ్యాపకుల డుమ్మా మరోవైపు వెరసి చదువులు సక్రమంగా సాగలేదు. ఇదంతా విద్యార్థుల తప్పు కానేకాదు. ఏయూ యంత్రాంగం వైఫల్యమే. క్లాసులే జరగకపోగా ఇపుడు మిడ్ పరీక్షలకు సిద్ధంకండంటూ ఏయూ ఇస్తున్న సర్క్యులర్లతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బిజీ బిజీ.. : ఏయూ క్యాంపస్ కొద్ది రోజులుగా వివిధ కార్యక్రమాలతో ఎంతో బిజీగా మారింది. అక్టోబర్, నవంబర్ నెలల్లో ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణతోపాటు ఓట్ల లెక్కింపు కోసం స్ట్రాంగ్ రూమ్‌లను యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం, తాజాగా సీఐఐ సదస్సును కూడా ఏయూలో నిర్వహించడం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఈ కార్యక్రమాల మధ్య యూనివర్సిటీలో చదువుకుంటున్న బీటెక్ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
సిలబస్ పూర్తికాకుండానే పరీక్షలా?
బీటెక్ విద్యార్థులకు మూడు నెలలుగా సక్రమంగా తరగతులు జరగలేదు. దీనికి ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని వీసీ కార్యాలయం సర్క్యులర్ జారీ చేసినప్పటికీ.. ఆ ఆదేశాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని విద్యార్థులు, తల్లిదండ్రులు వాపోతున్నారు. ఒక్క తరగతి కూడా సక్రమంగా నిర్వహించకుండా, సిలబస్ పూర్తికాకుండానే రెండో మిడ్ పరీక్షలను అకస్మాత్తుగా నిర్వహించడం ఎంతవరకు సమంజసమని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఇంటర్నల్ మార్కుల విషయంలోనూ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మధ్యలోనే గెస్ట్ ఫ్యాకల్టీ జంప్?
ఇటీవల ఏయూలో గెస్ట్ ఫ్యాకల్టీ పేరుతో కొంతమంది బయటి అభ్యర్థులు, పరిశోధకులను ఇంటర్వ్యూ ల ద్వారా ఎంపిక చేసి వివిధ విభాగాల్లో బోధన బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. కొన్ని విభాగాల్లో సెమిస్టర్ మధ్యలోనే వారు వెళ్లిపోవడంతో ఆయా సబ్జెక్టులు బోధించే అధ్యాపకులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత యంత్రాంగంపైన ఉన్నా.. లైట్ తీసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
స్కాలర్లే.. ప్రొఫెసర్లు! : కొన్ని విభాగాల్లో అధ్యాపకులు బోధించాల్సిన సబ్జెక్టులు, నిర్వహించాల్సిన ల్యాబ్‌ల బాధ్యతలను స్కాలర్లతో నిర్వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదే అదనుగా కొన్ని విభాగాల్లో పరిశోధక విద్యార్థుల ప్రవర్తన, వ్యవహా రశైలిపై కూడా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. వీటిపై ఏయూ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాల్సిన అవసరముంది. నాణ్యమైన బోధన, సక్రమమైన తరగతులు, న్యాయమైన మూల్యాంకనం తదితర సమస్యలపై ఏయూ యాజమాన్యం తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.


