ఏయూక్యాంపస్: నగరంలో నివసిస్తున్న ఉత్తర భారతీయ కుంటుంబాలు సాగర తీరంలో ఛట్ పూజలతో సందడి చేశాయి. పాండురంగాపురం డౌన్‌లోని బీచ్‌లో విద్యుత్ దీపాల వెలుగుల్లో చిన్నాపెద్దలతో కలిసి భక్తి శ్రద్ధలతో ఈ పండగ జరుపుకొన్నారు. వేకువజాము నుంచే వేలాది మంది తరలివచ్చి సూర్యోదయాన ఆదిత్యునికి ప్రత్యేక పూజలు చేశారు. సూర్యాస్తమయ సమయంలో సముద్రపు నీటిలో నిలిచి, సంప్రదాయ పద్ధతిలో పండ్లు, చెరకు గడలు, పిండివంటలతో అర్ఘ్యం సమర్పించారు. సోమవారం ఉదయం కూడా సూర్యుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తి గీతాలు, చిన్నాపెద్దా కోలాహలంతో విశాఖ తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.


