సామాన్యులకు సవాలక్ష నిబంధనలు
ప్రముఖుల పెళ్లిళ్లకు ప్రత్యేక అనుమతులు
ప్రైవేటు వివాహ వేదికగా స్వామివారి
కల్యాణం జరిగిన నృసింహ మండపం
చెప్పులతో అతిథుల రాకపోకలపై
భక్తులు, ధార్మిక సంఘాల ఆగ్రహం
సింహాచలం: సింహగిరిపై సామాన్య భక్తుల వివాహాలకు సవాలక్ష నిబంధనలు విధించే దేవస్థానం అధికారులు, ప్రముఖుల ఇళ్ల పెళ్లిళ్లకు మాత్రం నిబంధనలు పక్కనపెట్టి రెడ్‌కార్పెట్ పరుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణం జరిగిన పవిత్ర నృసింహ మండపం ప్రాంగణాన్ని ఒక వీఐపీ ప్రైవేటు వివాహ వేదికగా మార్చేశారు.
జాబితాలో లేకున్నా.. కేటాయింపు!
దేవస్థానం సూచించిన నిర్దిష్ట ప్రదేశాల్లో మాత్రమే పెళ్లి మండపాలు ఏర్పాటు చేసుకోవాలని, ఇందుకు రూ.15 వేలు రుసుము చెల్లించాలని ఇటీవల అధికారులు ప్రకటించారు. ఆ జాబితాలో నృసింహ మండపం, ప్రాంగణం లేదు. గత ఏడాది వరకు చైత్రశుద్ధ ఏకాదశినాడు స్వామివారి వార్షిక కల్యాణం ఇక్కడే జరిగేది. ఈ ఏడాది ఉత్తర రాజగోపురం ఎదురుగా ఉన్న ప్రాంగణాన్ని కల్యాణోత్సవం కోసం సిద్ధం చేయడంతో, నృసింహ మండపం ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వ ’ప్రసాద్’ పథకం నిధులతో యాంఫీ థియేటర్ నిర్మించారు. అది ఇంకా భక్తులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు.
దగ్గరుండి నడిపించిన అధికారులు
అయినప్పటికీ ఆదివారం తెల్లవారుజామున ఇదే ప్రాంగణంలో ఒక వీఐపీ కుటుంబ పెళ్లి జరిపించారు. దేవస్థానం ఇంజనీరింగ్ విభాగానికి డిజైన్లు అందించే ఓ ఆర్కిటెక్ట్ ఇంట వివాహానికి కొందరు అధికారులు దగ్గరుండి ఏర్పాట్లు నడిపించినట్లు తెలుస్తోంది. స్వామివారి వార్షిక కల్యాణం స్థాయిలో ఏర్పాట్లు చేసి.. తమ ‘స్వామి’భక్తి చాటుకున్నారు. పవిత్ర ప్రాంగణంలోకి అతిథులు చెప్పులతో యథేచ్ఛగా రాకపోకలు సాగించడంపై భక్తులు, హిందూ ధార్మిక సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పారదర్శకత అంటూనే నిబంధనలకు తూట్లు పొడుస్తున్న అధికారుల తీరుపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రైవేటు పెళ్లికి స్వామివారి వేదికా..!
దేవస్థానం ఆస్తులు ఎవరి వ్యక్తిగత ఆస్తులు కావు. స్వామివారి వార్షిక కల్యాణం నిర్వహించిన ప్రాంగణంలో ప్రైవేటు వ్యక్తుల వివాహానికి ఎవరు అనుమతిచ్చారో బహిర్గతం చేయాలి. సామాన్య భక్తులకు కూడా ఈ అవకాశం కల్పిస్తారా? దీనిపై ట్రస్ట్‌బోర్డు సభ్యులు, ఈవో సమాధానం చెప్పాలి.
– విజయశంకర్ ఫణీంద్ర,
కో కన్వీనర్, బీజేపీ ధార్మిక సెల్
సామాన్యుల పెళ్లిళ్లకు ఎలా అనుమతిస్తారు
స్వామివారి వార్షిక కల్యాణం కోసం కట్టిన నృసింహ మండపాన్ని స్వామివారి కోసమే వినియోగించాలి. అక్కడ సామాన్యుల పెళ్లిళ్లకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు. ఈ విషయంలో ట్రస్ట్‌బోర్డు సభ్యులు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. దీనిపై దేవస్థానం అధికారులు సమాధానం చెప్పాలి.
– పూడిపెద్ది శర్మ,
విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి


