ఆనందపురం: విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన రెల్లి రవి కుటుంబానికి న్యాయం చేయాలని బొడ్డపాలెం గ్రామస్తులు చేపట్టిన నిరసనకు విద్యుత్ శాఖ అధికారులు దిగొచ్చారు. మృతుడి కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం, భార్యకు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగం, నెలకు రూ.2 వేల పెన్షన్ ఇచ్చేందుకు అంగీకరించారు. బొడ్డపాలెంలోని ఇండో ఆక్వా కంపెనీలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో షిఫ్ట్ ఆపరేటర్ రెల్లి రవి(26) శనివారం విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ సమీపంలోని 11 కేవీ విద్యుత్ వైరు తగిలి విద్యుద్ఘాతానికి గురై మృతి చెందిన విషయం తెలిసిందే.
న్యాయం చేయాలంటూ నిరసన
రవి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ నిరసన చేపట్టారు. దీంతో పోలీస్‌స్టేషన్‌లో విద్యుత్ శాఖ డీఈ, ఏఈ, లైన్‌మెన్, గ్రామ పెద్దలు, బాధిత కుటుంబ సభ్యులతో అధికారులు చర్చలు జరిపారు. తెల్లవారుజామున 3 గంటల వరకు చర్చలు కొనసాగాయి. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. విద్యుత్ శాఖ ద్వారా రూ.5 లక్షలు, అవుట్‌సోర్సింగ్ ఇన్సూరెన్స్ ద్వారా రూ.10 లక్షలు, విద్యుత్ శాఖ సొంత నిధుల నుంచి మరో రూ.10 లక్షలు కలిపి మొత్తం రూ.25 లక్షల నష్టపరిహారం అందించేందుకు అధికారులు అంగీకరించారు. దీంతో పాటు మృతుడి భార్యకు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగం, కుటుంబానికి నెలకు రూ.2 వేల పెన్షన్ కల్పించేందుకు ఒప్పందం కుదిరింది. అధికారుల హామీతో గ్రామస్తులు నిరసన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి సీహెచ్‌సీకి తరలించారు. మృతుడి భార్య ఊహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


