విశాఖ స్పోర్ట్స్: వైఎస్సార్ స్టేడియంలో టెలిస్కోపిక్ ప్రాక్టీస్ నెట్స్ అందుబాటులోకి వచ్చాయి. స్టేడియంలోని వీఐపీ కార్ పార్కింగ్ ప్రాంతంలో విశాఖ జిల్లా క్రికెట్ సంఘం (వీడీసీఏ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాలుగు నెట్స్‌ను విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి సౌకర్యాలు క్రికెటర్ల నైపుణ్యాలను మెరుగుపర్చడంతో పాటు విలువైన సాధన అవకాశాలను కల్పిస్తాయన్నారు. నాలుగు నెట్స్‌లో మూడు టర్ఫ్ వికెట్లతో, మరో నెట్‌ను ఆస్ట్రోటర్ఫ్ వికెట్‌తో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సులభంగా ఏర్పాటు చేసుకునేలా..
టెలిస్కోపిక్ నెట్స్ పోర్టబుల్ ఫ్రీస్టాండింగ్ విధానంలో రూపొందించినట్లు వీడీసీఏ ఉపాధ్యక్షుడు డీఎస్ వర్మ తెలిపారు. తేలికై న, సర్దుబాటు చేసుకునే ఫ్రేమ్‌వర్క్‌తో వీటిని ఒకదానికొకటి క్లిప్ చేసి వంపు తిరిగేలా ఏర్పాటు చేశామన్నారు. సంక్లిష్టమైన పరికరాలు అవసరం లేకుండా త్వరగా అమర్చడం, తొలగించడం వీటి ప్రత్యేకతన్నారు. అవసరమైనప్పుడు మరో ప్రాంతానికి సులభంగా తరలించవచ్చన్నారు. కార్యక్రమంలో వీడీసీఏ కార్యదర్శి పార్థసారథి, ఉపాధ్యక్షులు డీఎస్ వర్మ, ఎస్‌ఎస్‌ఆర్‌కే ప్రసాద్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


