మహారాణిపేట: అంతర్జాతీయ యువజన ఉత్సవాల్లో భాగంగా 5కే రెడ్ రన్ కార్యక్రమాన్ని ఆదివారం ఆర్‌కే బీచ్ రోడ్డులో ఉత్సాహంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ విభాగం పర్యవేక్షణలో, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ర్యాలీని డీఎంహెచ్‌వో డాక్టర్ పి. జగదీశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. 17 నుంచి 25 ఏళ్ల వయసులోపు విద్యార్థినీ, విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. మహిళల విభాగంలో ప్రభుత్వ వ్యాయామ కళాశాలకు చెందిన టి. వాణి ప్రథమ బహుమతి, బీవీకే జూనియర్ కళాశాలకు చెందిన ఎ. గాయత్రి ద్వితీయ బహుమతి సాధించారు. పురుషుల విభాగంలో సమత డిగ్రీ కళాశాలకు చెందిన చల్లా సురేష్ ప్రథమ, ప్రభుత్వ ఐటీఐకి చెందిన బి. రాజుబాబు ద్వితీయ బహుమతి పొందారు. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.10 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.7 వేలు నగదు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా లెప్రసీ నివారణ అధికారి డాక్టర్ ఆర్. రమేష్, క్రీడా విభాగాధికారి అచ్యుత్, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ ఉమామహేశ్వరరావు, జిల్లా సూపర్‌వైజర్ బద్రి తదితరులు పాల్గొన్నారు.


